చంద్రబాబుపై సిక్కోలు నేతల చిర్రుబుర్రు పాత తరానికి కొత్త తరం సవాల్
టికెట్లు వచ్చిన వాళ్లు మైకులు పట్టుకుని 'ఊరూరా మా గుర్తుకే మీ ఓట్లంటూ' హోరెత్తిస్తుంటే టీడీపీ నేతలు ఉసూరంటున్నారు. కొత్తతరం పాతతరానికి సవాల్ విసురుతోంది.
ఏం పిల్లడో వెళ్దమొస్తవా, ఏం పిల్లో వెళ్దమొస్తవా.. సికాకుళంలో సీమలకొండకి.. అంటూ ఆవేళ వంగపండు ప్రసాదరావు ఉర్రూతలూపిన జిల్లా శ్రీకాకుళం. గిరిజన, రైతాంగ పోరాటాలతో, కళాప్రదర్శనలతో తడిసిముద్దయిన శ్రీకాకుళంలో ఎన్నికల చిలుకలు సందడి చేస్తున్నాయి. టికెట్లు వచ్చిన వాళ్లు రయ్ రయ్ మంటూ మైకులు పట్టుకుని 'ఊరూరా మా గుర్తుకే మీ ఓట్లంటూ' హోరెత్తిస్తుంటే టీడీపీ నేతలు ఉసూరంటున్నారు. తమ నేత చంద్రబాబింకా చిట్టా విప్పడేమని చిర్రుబుర్రులాడుతున్నారు. తమ సీట్లపై ఇంకా క్లారీటీ రాకపోడంతో ఏం జరగబోతుందోనని సీనియర్లు మదన పడుతుంటే కొత్తతరం పాతతరానికి సవాల్ విసురుతోంది.
టీడీపీకి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి...
ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ సిక్కోలు జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగిస్తూనే వస్తోంది. ఈక్రమంలో గడచిన మూడు దశాబ్ధాల కాలంలో టీడీపీ నుంచి ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇదంతా 2019కి ముందు చరిత్ర. వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా... ఇచ్ఛాపురం, టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి.
2024 ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో పైచేయి సాధించాలని చూస్తున్న టీడీపీ నాయకులు.... పార్టీ అధినాయకత్వం వైపు చూస్తున్నారు. పార్టీ నాయకుడు చంద్రబాబు నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పైగా జనసేనతో పొత్తు ఉందన్న నేపథ్యంలో ఎవరి సీట్లు ఉంటాయో, ఎవరి సీట్లు గల్లంతవుతాయోనని టెన్షన్ పడుతున్నారు.
ప్రస్తుతానికి పాత తరమే నాయకులు...
శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పాత నేతలే ప్రస్తుతానికి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా కొనసాగుతున్నారు. అయితే చాలా నియోజకవర్గాల్లో కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. ప్రస్తుత ఇంచార్జీలతో సమానంగా పని చేస్తూ ముందుకు దూసుకువెళుతున్నారు. దీంతో అక్కడక్కడ ముఠాలు కూడా ఏర్పాటయ్యాయి. అవిప్పుడు టీడీపీకి తలనొప్పిగానూ మారాయి. కొత్త తరం నేతలు కొందరు ఇప్పటికే తమకే సీట్లంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
కిమిడికి చెమట్లు పట్టిస్తున్న కలిశెట్టి...
ఎచ్చెర్ల ఇంచార్జిగా సీనియర్ నేత.. పాలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావ్ ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి కలిశెట్టి అప్పల నాయుడు.. కిమిడితో పోటీ పడుతున్నారు. సీటు తనదే అంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జిగా జి.లక్ష్మీదేవి పని చేస్తుండగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోండు శంకర్ పోటీ పడుతున్నారు. పాతపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట రమణకు పోటీగా .. మామిడి గోవింద్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలలో కొత్త తరం పాత తరానికి సవాల్ విసురుతోంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు మనసులో అసలేముందనేది అర్థం కాక టెన్షన్ పడుతున్నారు.