సింగరేణిలో టెండర్లతో నాకు సంబంధం  లేదు
x

'సింగరేణిలో టెండర్లతో నాకు సంబంధం లేదు'

సింగరేణి కాలరీస్ కు స్వయంప్రతిపత్తి తో బోర్డు ఉంది దాని విధివిధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారు


సింగరేణిలో టెండర్లు, వాటికి సంబంధించిన ఫైళ్లతో తనకు సంబంధం లేదని ఆర్థిక, ఎనర్జీ, ఫైనాన్స్ మంత్రిత్వ శాఖల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కట్టుకథల విషపు రాతలతో ఆరోపణలతో రాతలు రాస్తే వ్యక్తిత్వ హననంగా భావించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

శనివారం ఉదయం జ్యోతిరావు పూలే భవన్ లో ఆయన ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల తనపైన మరియు సింగరేణి పైన వస్తున్న వార్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వస్తున్న కథనాలు తనను ఆవేదనకు గురిచేశాయన్నారు.

సింగరేణి లో రాష్ట్ర ప్రభుత్వానిది 51 శాతం వాటా అయితే కేంద్రానిది 49 శాతం వాటా. ఈ సంస్థ పర్యవేక్షణ మొత్తం ముఖ్య మంత్రి ఆధీనంలోనే వుంటుంది.

సింగరేణి కాలరీస్ సంస్థకు ఒక బోర్డు ఉందని, అందులో సీనియర్ అధికారులు ఉంటారని, వారంతా ఒక స్వయంప్రతిపత్తి (Autonomous) తో నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. అన్ని నిర్ణయాలు సంస్థలో అమలులో ఉన్న విధివిధానాలు, నిబంధనల ప్రకారమే స్వతంత్రంగా తీసుకుంటారని, రాజకీయ జోక్యానికి ఎక్కడా అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాకు కాంట్రాక్ట్ విషయంలో కాంట్రాక్టర్లు ముందుగా సైట్ విజిట్ చేయాలని ఆ సర్టిఫికేట్ నిబంధన కొత్తగా పెట్టలేదని అన్నారు. ఈ నిబంధన దేశంలో మరెక్కడా లేదని కేవలం భట్టి విక్రమార్కకు చెందిన వారికి కాంట్రాక్టు అప్పగించడానికే ఇలా చేశారంటూ కట్టు కథనాలను, పిట్ట కథలను అల్లి వార్త ప్రచురించారని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన సైట్ విజిట్ సింగరేణిలో మాత్రమే ఉన్న నిబంధన కాదని, తమ హయాంలో ప్రవేశ పెట్టింది అంత కన్నా కాదని వివరించారు. 2018, 2021, 2023 లో కోలిండియా అనుబంధ సంస్థ అయిన సీఎంపీడీఐఎల్ రూపొందించిన సింగరేణి టెండర్ డాక్యుమెంట్ లో, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్ఎండీసీ, ఐఐటీ, ఐఐఎం, ఫైనాన్స్ విభాగం, డిఫెన్స్ విభాగం, గుజరాత్ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర చాలా కంపెనీల్లో చాలా ఏళ్లుగా ఉన్నట్లు, ఆయా కంపెనీలకు సంబంధించిన టెండర్ లేఖలను విలేకరులకు చూపించారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన అని, తాము కొత్తగా రూపొందించిందని స్పష్టం చేశారు.

సింగరేణిలో డీజిల్ సరఫరాను కాంట్రాక్టర్లకే అప్పగించడం ద్వారా మరో కుంభకోణానికి తెరలేపారన్న హరీశ్ రావు ఆరోపణలను ఆయన ఖండించారు. డీజిల్ సరఫరా విధానంలో మార్పులు 2022లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. జీఎస్టీ విధాన మార్పులు, డీజిల్ దొంగతనాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

సింగరేణి సంస్థ టెండర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి బావ మరిదికి కట్టబెడుతున్నట్లు ఒక కట్టు కథను ప్రచారం చేస్తున్నారని, వారు పేర్కొన్నట్లుగా సుజన్ రెడ్డి కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎండి దీప్తి రెడ్డి. ఆమె మాజీ టి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కుమార్తె. ఆమె భర్త, ఆయన అల్లుడే సుజన్ రెడ్డి అని వివరించారు.

అలాగే సింగరేణి వ్యాప్తంగా పలు కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్న ఐదు ప్రముఖ కాంట్రాక్టర్లు కూడా టీఆర్ఎస్ నేతలకు బంధువులు లేదా సన్నిహితులు అని వివరించారు. కేవలం నైనీ బ్లాక్ టెండర్ పైనే కాకుండా 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని రకాల టెండర్లపై కూడా విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారని ఆయన రాగానే తాను స్వయంగా ఆయనతో మాట్లాడి విచారణకు ఆదేశించేలా చూస్తానని పేర్కొన్నారు.

“సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి. దీనిపై వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం బురదజల్లడం రాష్ట్రానికి నష్టం చేస్తుంది” అని హెచ్చరించారు.“నేను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు దోచుకోవడానికి కాదు. ప్రజల ఆస్తులను కాపాడటానికే వచ్చాను. సింగరేణి కార్మికుల చెమటతో ఏర్పడిన ఈ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లో రాబందులకు అప్పగించను,” అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

సింగరేణి బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు గనుల అభివృద్ధిలో తగిన ప్రయత్నాలు జరగకపోవడం వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి, ఆదాయం తగ్గి వేలాది కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని హెచ్చరించారు.

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో మార్పులు, గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యమైన బొగ్గు గనులను త్వరగా సొంతం చేసుకుని ఆపరేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సింగరేణిని కేవలం బొగ్గుకే పరిమితం చేయకుండా క్రిటికల్ మినరల్స్ రంగంలోనూ విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.

Read More
Next Story