రూ.200కోట్ల మోసంలో సింగర్ మంగ్లీ పేరు !
x

రూ.200కోట్ల మోసంలో సింగర్ మంగ్లీ పేరు !

పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. బాధితుల తరఫు న్యాయవాది కీలక విషయాలు వెల్లడించారు.


సింగర్ మంగ్లీపై రూ.200 కోట్ల మోసం కేసు నమోదయింది. పెట్టుబడుల పేరుతో మోసం చేశారని అనేక మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ర్యాప్తు చేపట్టారు. ఈ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదు అయింది. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, మధు సహా మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల నుంచి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వసూళ్లు జరిగినట్లు సమాచారం.

ఈ వ్యవహారం రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. బాధితులు తమను మోసం చేశారని న్యాయవాది సుబ్బారావును సంప్రదించారు. విచారణలో మంగ్లీ, శివ, మధు పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. పెట్టుబడుల పేరుతో రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల్లో అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికి డబ్బులు సేకరించినట్లు వివరించారు. అయితే పెట్టుబడితో పాటు లాభాలు కూడా ఇవ్వకపోవడంతో బాధితులు ముందుకొచ్చినట్లు చెప్పారు.

ఈ క్రమంలో మంగ్లీని కలిసినప్పుడు ఆమె అహంకారంగా స్పందించినట్లు న్యాయవాది పేర్కొన్నారు. తాను కేసు తీసుకున్న తర్వాత కొందరు వ్యక్తులు మాట్లాడేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. పంజాగుట్టలో జరిగిన చర్చల్లో సమస్య పరిష్కారంపై చర్చించారని చెప్పారు. ఇక మంగ్లీ ఫోన్ చేసి ఇంటర్వ్యూలు తొలగించాలని, క్షమాపణ చెప్పాలని కోరినట్లు వెల్లడించారు. అయితే తనకు ఈ మోసంతో సంబంధం లేదని ఆమె తెలిపినట్లు చెప్పారు. సంబంధం లేకపోతే మధుపై కేసు పెట్టాలని సూచించినా ఆమె అంగీకరించలేదని వివరించారు.

మరోవైపు కేసు వెనక్కి తీసుకోవాలని డబ్బులు ఆఫర్ చేసినట్లు తెలిపారు. తాను తిరస్కరించడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. హిట్ అండ్ రన్ చేస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. ఈ బెదిరింపులపై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సుమారు 22 రోజుల క్రితం ఫిర్యాదు చేసిన తర్వాత తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వెల్లడించారు. వట్టిపల్లి తండాలోనే సుమారు 200 మంది బాధితులు ఉన్నట్లు చెప్పారు. మొత్తం వసూళ్లు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారని తెలిపారు. మంగ్లీ పేరు చెప్పడంతోనే మధుకు డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారని పేర్కొన్నారు. కోకాపేట్‌లో పలు ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పి పెట్టుబడులు సేకరించినట్లు వెల్లడించారు. గోకులనందన ఇన్ఫ్రా సంస్థ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. అధిక లాభాల ఆశతో చిన్న, మధ్య తరగతి ప్రజలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు వివరించారు. మొత్తంగా, ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Read More
Next Story