
ఫోన్ ట్యాపింగ్ కేసు, హరీష్ రావుకు సిట్ నోటీసులు
మంగళవారం ఉదయం విచారణకు రావాలంటూ తెలిపిన అధికారులు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్)కు చెందిన కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరై విచారణకు సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు, ఇతర సంబంధిత వ్యక్తులను సిట్ విచారించింది. తాజా నోటీసులతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.
అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం ఏంటి?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పలువురు రాజకీయ నేతలు, అధికారులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్ కాల్స్‌ను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఉపయోగించి నిఘా కొనసాగించారని, సేకరించిన సమాచారాన్ని రాజకీయ అవసరాలకు వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిన అంశాలు ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది.
ఫోన్ టాపింగ్‌తో హరీష్‌కు సంబంధం ఏంటి?
ఈ కేసులో సిట్ ఇప్పటికే విచారించిన కొందరు పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల్లో హరీశ్ రావు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సమాచారం అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతల వరకు చేరేదన్న అంశంపై సిట్ దృష్టి పెట్టింది. ఆ సమయంలో హరీశ్ రావు కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వంలో ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఆయనకు ఎంతవరకు అవగాహన ఉంది అనే కోణంలో విచారణ అవసరమని సిట్ భావించినట్లు సమాచారం. ఈ కారణంగానే ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరింది. హరీశ్ రావు విచారణలో ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

