మోయినాబాద్ డ్రగ్స్ కేసు: సిట్ దర్యాప్తు ప్రారంభం
x

మోయినాబాద్ డ్రగ్స్ కేసు: సిట్ దర్యాప్తు ప్రారంభం

నిందితుల విచారణ, ఫామ్‌హౌస్ సీజ్, గన్ లైసెన్స్ రద్దుపై చర్యలు చేపట్టిన అధికారులు.


మోయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజా పరిణామంగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం తొమ్మిది మంది అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. నిందితుల విచారణతో పాటు డ్రగ్స్ పార్టీపై లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో ఈ బృందం పని చేయనుంది. సిట్ చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ బాధ్యతలు చేపట్టారు. సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఈగల్ డీఎస్పీలు బుచ్చయ్య, హరీశ్ చంద్రారెడ్డి, మోయినాబాద్ ఎస్‌హెచ్‌వో మల్లిఖార్జున, ఎస్‌ఐలు కోటేశ్వర్ రావు, వెంకన్న, సదత్ అలీలు ఉన్నారు.

ఫామ్‌హౌస్‌పై ఆరోపణలు

పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని సిట్ గుర్తించింది. అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఫామ్‌హౌస్‌ను వెంటనే సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు సిట్ లేఖ రాసింది. దీనిపై తదుపరి చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం. ప్రధాన నిందితులుగా ఉన్న రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్ కోరింది. విచారణను మరింత లోతుగా తీసుకెళ్లే దిశగా ఈ చర్యలు చేపట్టింది.

రితేశ్ రెడ్డి గన్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు సిట్ లేఖ రాసింది. ఈ పరిణామాలతో మోయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అధికారులు తీసుకునే తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి.

Read More
Next Story