లైంగిక వేధింపుల కేసులో ఆ ఇద్దరికి సిట్ నోటీసులు
మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక రాష్ట్రం హసన్ నియోజకవర్గ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి, ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది.
ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియో కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మంగళవారం జేడీ(ఎస్) ఎంపీకి నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని కోరింది. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి, ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
హాసన్ లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్‌ను పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీ చేసింది.
రేవణ్ణ ఇంట్లో పనిచేసే ఓ మహిళ ఫిర్యాదు మేరకు హాసన్ జిల్లా హోలెనర్సిపుర పోలీస్ స్టేషన్‌లో తండ్రీకొడుకులిద్దరిపై ఆదివారం కేసు నమోదైంది.
ఐపీసీ సెక్షన్లు 354A (లైంగిక వేధింపులు), 354డి (వెంబడించడం), 506 (బెదిరింపు), 509 (మహిళ యొక్క అణకువను అవమానించడం) కింద కేసు ఫైల్ చేశారు.
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక కుంభకోణంపై అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరలయిన విషయం తెలిసిందే. ప్రజ్వల్ దేశంలో లేరని, ఏప్రిల్ 26న కర్ణాటకలో మొదటి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
పార్టీ బహిష్కరణ..
మహిళలను లైంగికంగా వేధించినట్లు వీడియోలు బయటకు రావడంతో ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనతాదళ్( సెక్యూలర్) ప్రకటించింది. ఏప్రిల్ 26న కర్నాటకలో మొదటి దశ లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ వీడియోలు ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ అయ్యాయి.
వివరణ కోరిన జాతీయ మహిళా కమిషన్..
మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) కర్ణాటక పోలీసులను మూడు రోజుల్లోగా నివేదిక కోరింది. కర్నాటక డీజీపీకి రాసిన లేఖలో, రేవణ్ణ అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం.