
కలం సృష్టించిన కలత: వివాదస్పద వార్త మీద 'సిట్'
ఈ వార్తల ప్రసారం మీద, వీటిని ప్రసారం చేసిన న్యూస్ చానెళ్ల మీద, ఈ వార్తలు రాసిన జర్నలిస్టుల మీద అధికారుల్లో తీవ్ర నిరసన మొదలయింది.
మహిళా ఐఎఎస్ అధికారుల మీద నిరాధార వార్తలు ప్రచారం చేశారంటూ తెలంగాణ ప్రభుత్వం కొంతమంది జర్నలిస్టుల పై దర్యాప్తు అదేశించింది. ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరు అధికారుల పోస్టింగ్ మీద ప్రసారమయిన ఒక వార్త బాగా వివాదాస్పద సృష్టించింది. ఈ వివాదంతో ఒక మంత్రి పేరు కూడా ప్రస్తావన రావడంతో ఈ వివాదం తెలంగాణలో సంచలనంగా మారింది. ఇది అధికారుల ప్రతిష్టకు భంగకరమైన వార్త అని అఖిల భారత సర్వీసుల అధికారుల సంఘాలు ఖండించాయి. ఈ వార్తల ప్రసారం మీద, వీటిని ప్రసారం చేసిన న్యూస్ చానెళ్ల మీద, ఈ వార్తలు రాసిన జర్నలిస్టుల మీద తీవ్ర నిరసన మొదలయింది.
దీనితో వార్త వెనక ఏదైనా దురద్దేశం ఉందా అనే విషయం తేల్చేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్ ) ఏర్పాటు చేసింది. దీని పర్యావసానంగా ముగ్గురు సీనియర్ జర్నలిస్ట్‌లతో కలిపి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. మంగళవారం అర్థరాత్రి జర్నలిస్టుల ఇళ్ల తలుపులను బద్దలు కొట్టుకుని వెళ్లి మరీ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ అరెస్ట్‌తో పాటు పలు టీవీ ఛానెళ్లు, 40 యూట్యూబ్ ఛానెళ్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఎనిమిది సభ్యుల సిట్‌కు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సిట్‌లో నార్త్ రేంజ్ జాయింట్ సీపీ ఎన్ స్వేతా, చేవెళ్ల ఫ్యూచర్ సిటీ డీసీపీ యోగేష్ గౌతమ్, ఏడీఎంఎన్ హైదరాబాద్ సిటీ డీసీపీ కే వెంకట లక్ష్మీ, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ వీ అరవింద బాబు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషినల్ ఏసీబీ బీ ప్రతాప్ కుమార్, హైదరాబాద్ ఏసీపీ, సీసీఎస్ జీ గురు రాఘవేంద్ర, సీఐ సెల్ ఇన్‌స్పెక్టర్ సీ శంకర్ రెడ్డి, షీ సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే జర్నలిస్ట్ దొంతు రమేష్, పరిపూర్ణాచారి, దాసరి సుధీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఐఏఎస్ అధికారులను కించపరుస్తూ కథనాలు రాసిన వార్తా పత్రికలు, టివి ఛానెళ్లపై అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ 75, 78, 79, 351(1), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ వార్తల్లో ప్రముఖంగా మంత్రి కోమటిరెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇది కుట్రఅని, దురుద్దేశంతో కూడుకున్న వార్త అని మంత్రి కోమటిరెడ్డి కూడా ఖండించారు.
బహిరంగ క్షమాపణలు చెప్పాలి
అధికారులమీద తప్పుడు వార్త ప్రసారం చేసినందుకు టీవి సంస్థ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు బహిరంగ లేఖను విడుదల చేసింది. ఎంతో కష్టపడి సివిల్ సర్వీస్‌కు ఎంపికయిన మహిల అధికారులపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని, ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. అంతేకాకుండా వార్తా కథనంలో పేర్కొన్నట్లు.. మంత్రి సిఫార్సుతోనే సదరు అధికారిణికి ప్రత్యేక పోస్టింగ్‌లు ఇవ్వడం జరిగిందన్నది అసత్యమని స్పష్టం చేసింది. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు పూర్తిగా పరిపాలనాపరమైన నిర్ణయాలని, వాటికి వ్యక్తిగత సంబంధాలను అంటగట్టడం జర్నలిజం నైతికతకు విరుద్ధమని ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
నన్నేమైనా అనండి.. మహిళలను లాగొద్దు: మంత్రి కోమటిరెడ్డి
ఈ అంశంపై ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను ఏమన్నా, తనపై రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా తీసుకుంటానని అన్నారు. కానీ ఒక మహిళా అధికారిపై ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని, ఆమె పరువు తీయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం కేవలం ముఖ్యమంత్రికి ఉంటుంది. నా కొడుకును కోల్పోయిన బాధలో నేను ఉన్నాను. ఇలాంటి సమయంలో నాపై ఇలాంటి అసత్య కథనాలు రాయడం ఇంకా కుదిపేస్తోంది’’ అని పేర్కొన్నారు.
‘‘తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవినే త్యాగం చేశాను. అద్దె ఇంట్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాను. నా కొడుకు మరణంతో నేను సగం చనిపోయాను. ఇప్పటికి అయినా ఇలాంటి రాతలు రాయడం మానుకోండి’’ అని కోరారు. అంతేకాకుండా ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీఎంను కోరారు. ఈ వివాదాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండించారు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై వార్తలు రాయడం సరికాదని, ఈ సంప్రదాయానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరారు.
అయితే ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురు జర్నలిస్ట్‌లను ఆరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌లను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. పండగ పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఉందా అని బిఆర్ ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
పండగపూట ఇది అవసరమా: హరీష్
‘‘పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.
జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం: రామచందర్ రావు
ఈ వ్యవహారంలో ముగ్గురు జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పార్టీ తరుపున అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇది రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిగిన ప్రమాదకరమైన దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని, అలాగే వారి “ఇందిరమ్మ రాజ్యం” ఎంత భయంకరంగా ఉందో బయటపెడుతోందని రాంచందర్ రావు పేర్కొన్నారు.
“ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ తన విమర్శకులను జైలుకు పంపినట్లే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్టు చేయడం ద్వారా కాంగ్రెస్ మరోసారి తన భయానక ఎమర్జెన్సీ కాలపు లక్షణాలను ప్రదర్శించింది” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమర్జెన్సీ మనస్తత్వం ఇంకా మారలేదని, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి భయబ్రాంతులకు గురిచేయడం, సెన్సార్ విధించడం, బెదిరింపులకు పాల్పడటం ద్వారా విభిన్న స్వరాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేక వార్తా చానళ్లపై నిషేధాలు విధిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అధికార ధోరణిని మరింత ముందుకు తీసుకెళ్లి, మీడియాపై—ముఖ్యంగా తమ విమర్శకులపై—అరెస్టుల పరంపరను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఇది వేరే రాజకీయ జెండా కింద కొనసాగుతున్న అదే ప్రజాస్వామ్య విరుద్ధ సంస్కృతి” అని ఆయన అన్నారు. స్వేచ్ఛాయుత పత్రిక ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, తన బాధ్యతను నిర్వర్తిస్తున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యంలో తీవ్రమైన నేరమని ఆయన స్పష్టం చేశారు. ఈ అరెస్టులను భారతీయ జనతా పార్టీ ఘాటుగా ఖండిస్తోంది.
మీడియా వర్గాల పక్షాన బీజేపీ అచంచలంగా నిలుస్తుందని, బెదిరింపులు మరియు ప్రభుత్వ యంత్రాంగ దుర్వినియోగం ద్వారా పత్రికా స్వేచ్ఛను అణిచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
పోలీసుల తీరుపై జర్నలిస్టుల ఆగ్రహం
ఈ వివాదంలో మంగళవారం రాత్రి పోలీసులు పలువురు జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేశారు. కాగా ఈ విషయంలో పోలీసుల తీరుపై జర్నలిస్ట్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి జర్నలిస్టులను పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. ‘‘ముగ్గురు జర్నలిస్ట్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న జర్నలిస్ట్‌ను కూడా ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారు’’ అని జర్నలిస్ట్ ప్రశ్నించారు.

