
ఆరుగంటలుగా మంటల్లోనే ఆరుగురు..అద్భుతం జరుగుతుందా ?
పై అంతస్తులో అంటే నాలుగో అంతస్తులు ఆరుగురు చిక్కుకుపోయారనే విషయాన్ని చాలాసేపటి తర్వాత కాని గుర్తించలేదు
దట్టమైన మంటల్లో ఆరుగురు చిక్కుక్కుపోయారు. వారు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలీదు. మధ్యాహ్నం నుండి ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా మంటలు మాత్రం అదుపులోకి రావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ (Nampally fire accident)నాంపల్లిలో నాలుగు అంతస్తుల్లో ఒక ఫర్నీచర్ షాపుంది. మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కింది అంతస్తులో మంటలు అంటుకుని ఒక్కసారిగా పైకి పాకాయి. దాంతో ఫర్నీచర్ షాపులో పనిచేస్తున్న అందరు బయటకు వచ్చేశారు. వెంటనే అగ్నిమాపకశాఖకు ఫోన్ చేశారు.
ఫోన్ రాగానే ఫైర్ ఫైటర్స్ కూడా ఫర్నీచర్ షాపు దగ్గరకు వచ్చేశారు. మంటలను ఆర్పేపని మొదలుపెట్టారు. అయితే ఎంతకీ మంటలు మాత్రం అదుపులోకి రావటంలేదు. అదుపులోకి రాకపోగా ఇంకా ఇంకా పెరుగుతునే ఉంది. కారణం ఏమిటంటే మంటలు అంటుకున్నది ఫర్నీచర్ షాపు కావటమే. ఫర్నీచర్ షాపులో ఫోమ్, లెదర్ తదితర వస్తువులుండటం, వాటిని అంటించేందుకు ఉపయోగించే వార్నిషులు కూడా ఉండటంతో అవన్నీ మంటలకు అంటుకున్నాయి. దాంతో మంటలు ఎంతకీ అదుపులోకి రావటంలేదు.
ఈ విషయం ఇలాగుండగా పై అంతస్తులో అంటే నాలుగో అంతస్తులు ఆరుగురు చిక్కుకుపోయారనే విషయాన్ని చాలాసేపటి తర్వాత కాని గుర్తించలేదు. చిక్కుకుపోయిన ఆరుగురిలో ఇద్దరు చిన్నపిల్లలున్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం కారణంగా నాంపల్లిలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. నాలుగో అంతస్తులో మంటల్లో చిక్కుకుపోయిన వారిలో షాపులో పనిచేసే వాచ్ మెన్ పిల్లలు అఖిల్, ప్రణీత్ తో పాటు ఉద్యోగులు ఇంతియాజ్ తో కలిపి మరో ముగ్గురున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతు లోపల ఎంతమంది ఉన్నారనే విషయమై స్పష్టత లేదన్నారు. రోబోలను లోపలకి పంపి రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హైడ్రా బృందం, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు ఘటనా స్ధలంలోనే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మంటలు కాస్త అదుపులోకి వస్తే నాలుగో అంతస్తులో ఎవరు ఎక్కడ ఉన్నారనే విషయాలు తెలుస్తాయని సజ్జనార్ తెలిపారు.

