
నన్ను చంపడానికి ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు: మంత్రి వాకిటి
చావు అనేది దేవుడు నిర్ణయిస్తేనే సంభవిస్తుంది. నేను చావుకు భయపడనంటూ వాకిటి సంచలన వ్యాఖ్యలు.
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరిని హత్య చేయడానికి కుట్రలు జరుగుతున్నాయా అంటే ఆయన అవుననే అంటున్నారు. తనను చంపడానికి ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే తనను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తనపై అభాండాలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే తనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడు నిర్ణయం ప్రకారమే ఎవరి మరణమైనా సంభవిస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని అన్నారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయని బాంబు పేల్చారు. ‘‘నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చావు అనేది దేవుడు నిర్ణయిస్తేనే సంభవిస్తుంది. నేను చావుకు భయపడను’’ అని ఆయన అన్నారు. తనను అనేక విధాలుగా అవమానించారని, వాటిని పడినందుకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం పనిచేస్తు, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని అన్నారు. ‘‘మున్సిపల్ ఎన్నికల సమయంలో నేనే టార్గెట్‌గా అనేక అభాండాలు మోపారు. ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు మాత్రం నిజాన్ని తెలుసుకుని అద్భుతమైన తీర్పునిచ్చారు’’ అని అన్నారు.
72 సంవత్సరాల్లో 14 మంది ఎమ్మెల్యేలు మక్తల్‌కు ప్రాతినిధ్యం వహించారని, వారంతా కలిపి నియోజకవర్గాన్ని తీసుకొచ్చింది కేవలం రూ.296కోట్లేనని తెలిపారు. కానీ తాను మాత్రం రెండేళ్లలోనే రూ.1035కోట్ల నిధులు తీసుకొచ్చాని చెప్పారు. ఈ సందర్భంగానే ప్రశ్నించడం మంచిదేనని, కానీ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లని అవమానించడం సరైన పద్దతి కాదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని అవమానాలు చేసినా నేను భయపడను, బెదరను, అభివృద్ధి కోసమే పనిచేస్తానని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడపడం కోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు.

