
సాదా బైనామా భూములకు త్వరలో పరిష్కారం: రేవంత్
ఉగాది వేడుకల్లో రైతు సంక్షేమం, రుణమాఫీ, రైతు భరోసా, భూ సమస్యలపై సీఎం కీలక ప్రకటనలు చేశారు.
ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణలో కీలక ప్రకటన వెలువడింది. సాదా బైనామా భూముల సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ నెల 22న రైతు భరోసా అందించనున్నట్లు ప్రకటిస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.
రైతు సంక్షేమంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. ధరణి వ్యవస్థ వల్ల ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి ద్వారా ముందుకు వెళ్తున్నామని వివరించారు. సాదా బైనామా అంశంపై త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు పంటలకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలో తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణలోనే ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన ఆధారం అని సీఎం స్పష్టం చేశారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల రుణమాఫీ అమలు చేసినట్లు గుర్తుచేశారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ. 12 వేల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ. 18 వేల కోట్లు రైతులకు అందించినట్లు వెల్లడించారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులలో నమ్మకం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రతిష్టను పెంచుతాయని తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యలు, రైతు సంక్షేమ చర్యలపై ప్రభుత్వం ముందుకు సాగుతున్న దిశలో ఈ ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

