విజయశాంతి ఆత్మహత్యలో కొత్త సమాచారం
x

విజయశాంతి ఆత్మహత్యలో కొత్త సమాచారం

కేసును దర్యాప్తుచేస్తున్న పోలీసులు జనవరి 30వ తేదీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు


ఆరురోజులుగా పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా పిన్నింటి విజయశాంతిరెడ్డి, ఇద్దరు పిల్లల ఆత్మహత్యకు కారణం ఏమిటనే విషయాన్ని ఛేదించలేకపోతున్నారు. ఆత్మహత్య వెనుక ఏదో కారణం ఉందని అందరికీ అనిపిస్తోంది కాని ఆ కారణమే ఏమిటన్నది అంతుచిక్కటంలేదు. కేసును దర్యాప్తుచేస్తున్న పోలీసులు జనవరి 30వ తేదీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఎందుకంటే ఆరోజే విజయశాంతిరెడ్డి విషయంలో ఏదో జరిగిందన్నది గట్టి అనుమానంగా ఉంది. కారణం ఏమిటంటే ఇద్దరు పిల్లలను ఔటింగ్ పేరుతో విజయశాంతి హాస్టళ్ళ నుండి బయటకు తీసుకుని వెళ్ళి చర్లపల్లి రైల్వేస్టేషన్ గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తున్న విజయశాంతి నివసిస్తున్న కాలనీలోని జనాలను, ఇరుగు, పొరుగును, కంపెనీలోని ఉద్యోగులను, పిల్లలు చదువుకుంటున్న కాలేజీ, హాస్టల్ సిబ్బందిని ఇలా ఇప్పటివరకు పోలీసులు 200 మందిని విచారించారు. అయినా ఎవరి దగ్గర నుండి ఎలాంటి అనుమానాలు కూడా వ్యక్తం కాలేదు. ఆత్మహత్య చేసుకున్న రోజున ఆమెతో పాటు పిల్లలు ప్రయాణించిన రూటులోని 100 సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించారు. అన్నింటిలోను తల్లి ఒంటరిగా వెళ్ళటం, తర్వాత పిల్లలను కూడా తీసుకుని రావటం మాత్రమే కనిపిస్తున్నాయి. వాళ్ళ కదలికలో ఎలాంటి అనుమానాస్పదమూ కనబడలేదు పోలీసులకు.

విచారణలో భాగంగా పోలీసులకు కొత్త సమాచారం ఒకటి తెలిసింది. అదేమిటంటే జనవరి 27వ తేదీన కూతురు చైతన్యారెడ్డిని విజయశాంతి హాస్టల్ నుండి ఔటింగ్ పేరుతో బయటకు తీసుకొచ్చింది. ఐఐటి ప్రవేశపరీక్ష రాసిన తర్వాత 29వ తేదీన కూతురుని తల్లి మళ్ళీ హాస్టల్లో వదిలిపెట్టారు. అలాగే 30వ తేదీన కొడుకు విశాల్ రెడ్డిని వెంటపెట్టుకుని మళ్ళీ చైతన్యారెడ్డి ఉంటున్న హాస్టల్ కు వెళ్ళింది. కూతురును తమతో బయటకు పంపాలని అడిగారు. ఒక్కరోజులోనే మళ్ళీ ఔటింగ్ ఏమిటని హాస్టల్ సిబ్బంది విజయశాంతిని ప్రశ్నించారు. తమ బంధువులు చనిపోయారని అందుకనే ఇద్దరినీ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాలని తల్లి చెప్పగానే సిబ్బంది సరే అని చైతన్యారెడ్డిని బయటకు పంపారు.

హాస్టల్ నుండి ఇద్దరు పిల్లలతో కలిసి బయలుదేరిన విజయశాంతిరెడ్డి చివరకు పిల్లలు ఇద్దరితో కలిసి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకోవాలని ముందే నిర్ణయించుకుని ఉంటే ఔటింగ్ పేరుతో కూతురును బయటకు తీసుకొచ్చిన విజయశాంతి మళ్ళీ కూతురుని హాస్టల్లో దిగబెట్టేది కాదని పోలీసులు భావిస్తున్నారు. 30వ తేదీనే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి విజయశాంతి వచ్చి ఉంటారని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.

ఆత్మహత్య నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు కొడుకును హాస్టల్లో నుండి బయటకు తీసుకొచ్చి తర్వాత కూతురుని కూడా తీసుకొచ్చి ఉంటుందని తర్వాతే ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారన్నది పోలీసుల విశ్లేషణ. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా ఏదో కారణం కచ్చితంగా ఉంటుంది. అయితే ఏ కోణంలో చూసినా ఈ తల్లీ, పిల్లల ఆత్మహత్యకు కారణాలు మాత్రం అంతుచిక్కటంలేదు. ఫోరెన్సిక్ లేబరేటరీకి పంపిన మొబైల్, ల్యాప్ టాప్ ఓపెన్ అయితే కారణం తెలిసే అవకాశం ఉందని పోలీసులు ఆశిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story