సోనియా జీవితంపై సినిమా.. నిర్మాతలు కాంగ్రెస్ కార్యకర్తలే!
x

సోనియా జీవితంపై సినిమా.. నిర్మాతలు కాంగ్రెస్ కార్యకర్తలే!

ఇంతకీ సినిమాలో ఏం చూపించబోతున్నారు?


1) సోనియా జీవితంపై సినిమా.. నిర్మాతలు కాంగ్రెస్ కార్యకర్తలే!

2) తండ్రి చికిత్స కోసం వచ్చి.. అండాల మాఫియా చేతికి చిక్కిన యువతి!

3) సదస్సులు సరే.. పెట్టుబడులు ఎక్కడ? తెలంగాణకు లాభమెంత?

1) సోనియా జీవితంపై సినిమా.. నిర్మాతలు కాంగ్రెస్ కార్యకర్తలే!

ఒకప్పుడు దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా.. ఆ పదవిని వదులుకున్న నాయకురాలు! రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నాయకురాలు! కుటుంబంలో విషాదాలు.. రాజకీయంగా సవాళ్లు.. అయినా కాంగ్రెస్ పార్టీని దశాబ్దాల పాటు నడిపించిన నాయకురాలు! ఆమె మరెవరో కాదు.. సోనియా గాంధీ!ఇప్పుడు ఆమె జీవిత కథ వెండితెరపైకి రాబోతోంది. అయితే ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీనికి నిర్మాతలు సినీ ప్రముఖులు కాదు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు!

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ సినిమాపై సంచలన ప్రకటన చేశారు. సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరించనున్నారట. అంటే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలే కలిసి ఒక రాజకీయ నాయకురాలి జీవితాన్ని సినిమాగా నిర్మించబోతున్నారన్నమాట!

ఇంతకీ సినిమాలో ఏం చూపించబోతున్నారు?

ఇటలీలో పుట్టి పెరిగిన సోనియా.. రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని భారతదేశానికి వచ్చారు. నెహ్రూ కుటుంబంలోకి అడుగుపెట్టిన ఆమె జీవితం.. ఇందిరాగాంధీ హత్య తర్వాత మరో మలుపు తిరిగింది. భర్త రాజీవ్ గాంధీ మరణం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే సందిగ్ధం.. చివరకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం.. ఇలా ఆమె జీవితంలోని కీలక ఘట్టాలను సినిమాలో చూపించాలన్నది జగ్గారెడ్డి ఆలోచన.

ముఖ్యంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా ఆ పదవిని చేపట్టకపోవడాన్ని ఒక చారిత్రక నిర్ణయంగా సినిమాలో ప్రస్తావించనున్నట్లు ఆయన చెబుతున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎంపిక చేయడంలో సోనియా కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా వెనుక రాజకీయ ప్రయోజనం ఉందా? ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న! కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ కేవలం ఒక నాయకురాలు మాత్రమే కాదు. గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వానికి, పార్టీ ఐక్యతకు ఆమె ఒక కీలక ప్రతీక. ఆమె రాజకీయ ప్రయాణం, త్యాగాలు, ఎదుర్కొన్న సవాళ్లను సినిమాగా చూపించడం ద్వారా యువతకు కాంగ్రెస్ చరిత్రను పరిచయం చేయాలన్న ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు. మరోవైపు కార్యకర్తలే నిర్మాతలుగా ఉండటం ద్వారా పార్టీ శ్రేణుల్లో కూడా సోనియా పట్ల ఉన్న అభిమానాన్ని ఒక నిర్మాణాత్మక కార్యక్రమంగా మార్చే ప్రయత్నం కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం 50 మందితో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బడ్జెట్ ఎంత? నటీనటులు ఎవరు? సోనియా పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు? సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మొత్తానికి.. రాజకీయ నాయకుల జీవితాలు పుస్తకాలకే పరిమితం కాకుండా వెండితెరపైకి వస్తున్నాయి. మరి సోనియా గాంధీ జీవిత కథ కాంగ్రెస్ చరిత్రను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్తుందా? లేక ఇది పార్టీ అభిమానులకే పరిమితమవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది!


2) తండ్రి చికిత్స కోసం వచ్చి.. అండాల మాఫియా చేతికి చిక్కిన యువతి!

నాన్నకు ప్రాణాపాయం.. కిడ్నీ మార్పిడి చేయించాలి.. అందుకోసం చేసిన అప్పులు రూ.3.5 లక్షలు!అప్పులు తీర్చాలి.. నాన్నను బతికించుకోవాలి! ఏం చేయాలో తెలియని పరిస్థితి! అలాంటి సమయంలో ఒక ఏజెంట్ పరిచయమయ్యాడు. హైదరాబాద్ వస్తే రూ.50 వేలు ఇస్తానన్నాడు. ఆ డబ్బుతో కుటుంబ కష్టాలు తీరుతాయని ఆశపడింది. కానీ హైదరాబాద్‌కు వచ్చాక ఆమెకు ఎదురైన పరిస్థితి వేరు! తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆరాటంతో వచ్చిన ఆ యువతి.. చివరకు అక్రమ అండాల సేకరణ ముఠా చేతిలో బాధితురాలిగా మారింది! ఇది ఒక్క యువతి కథ మాత్రమే కాదు.. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మహిళల శరీరాలతో వ్యాపారం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా దందా!హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారాన్ని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు బయటపెట్టారు.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 43 మంది మహిళలను రక్షించారు. ఈ వ్యవహారంలో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.అసలు ఈ ముఠా మహిళలను ఎలా వలలో వేసుకుంటోంది?ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని పేద కుటుంబాలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటోంది.

అప్పుల బాధతో ఉన్న యువతులను ఏజెంట్లు గుర్తిస్తారు. రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తామని ఆశ చూపిస్తారు. ఉద్యోగం పేరుతోనో, ఆర్థిక సాయం పేరుతోనో హైదరాబాద్‌కు తీసుకొస్తారు.ఆ తర్వాత రహస్య వసతి గృహాల్లో ఉంచి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అండాలు పరిపక్వం చెందాక వాటిని సేకరించి నగరంలోని ఐవీఎఫ్ కేంద్రాలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇక్కడ మరో ఆందోళనకరమైన అంశం ఉంది.

అండాల సేకరణ అనేది వైద్య పర్యవేక్షణలో జరగాల్సిన ప్రక్రియ. కానీ అక్రమంగా, సరైన వైద్య భద్రత లేకుండా హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం, అండాలు సేకరించడం మహిళల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చు. ఈ దందాలో బాధితులుగా మారుతున్నది ఎవరు?

భర్త ప్రమాదంలో మంచాన పడితే.. అతడి చికిత్స కోసం మరో మహిళ ఈ ముఠా వలలో చిక్కుకుంది.క్యాటరింగ్ ఉద్యోగం ఉందని నమ్మించి మరికొందరిని తీసుకొచ్చారు.ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. బాధితుల ఆధార్ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్‌లను కూడా ఏజెంట్లు తమ దగ్గరే ఉంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.అంటే డబ్బు ఆశ చూపి తీసుకురావడం మాత్రమే కాదు.. వారి స్వేచ్ఛను కూడా నియంత్రించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఆ 43 మంది పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం వారిని ఉజ్వల రెస్క్యూ హోంలో ఉంచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.పండగ సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కనీసం ఛఠ్ పూజకైనా తమ ఇళ్లకు పంపించాలని అధికారులను వేడుకుంటున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంలో నగరంలోని 23 ఐవీఎఫ్ కేంద్రాలపై పోలీసులు నిఘా పెట్టారు.రెండేళ్లుగా సాగుతున్నట్లు అనుమానిస్తున్న ఈ అక్రమ దందా వెనుక ఇంకా ఎవరున్నారు? ఎంతమంది మహిళలు బాధితులుగా మారారు? అక్రమంగా సేకరించిన అండాలు ఎక్కడికి చేరుతున్నాయి?ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు రావాల్సి ఉంది.

తండ్రిని బతికించుకోవాలన్న ఒక యువతి ఆవేదన.. మరోవైపు అప్పుల బాధలో ఉన్న వందలాది మంది మహిళల నిస్సహాయత!మహిళల పేదరికాన్ని పెట్టుబడిగా మార్చుకుని, వారి ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే ఇలాంటి ముఠాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు?


3) భారత్‌ సమ్మిట్‌.. హైదరాబాద్‌కు పెట్టుబడులు, ఉద్యోగాలు తెస్తుందా?

అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందా? ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పేస్‌ రంగాల్లో కొత్త పెట్టుబడులకు మార్గం సుగమమవుతుందా? ఈ పరిచయాలు స్థానిక యువతకు ఉద్యోగాలుగా మారతాయా? నవంబర్‌ 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో రెండో భారత్‌ సమ్మిట్‌ జరగనుంది. 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక సహకారం, సమాన అభివృద్ధి, అంతర్జాతీయ సంబంధాల బలోపేతం ఈ సదస్సు ప్రధాన లక్ష్యాలు. అయితే ఈ వేదిక తెలంగాణకు ఎంతవరకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గత సమ్మిట్‌ ఏం సాధించింది?

2025 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి భారత్‌ సమ్మిట్‌లో 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం, ప్రపంచ న్యాయం, వాతావరణ మార్పులు వంటి అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. అయితే ఈ సదస్సులో ప్రత్యక్ష పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు ప్రధాన లక్ష్యాలు కాదు. అందుకే పెట్టుబడులు రాలేదని దాన్ని వైఫల్యంగా చూడలేం.

మరోవైపు, 2025 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్ సదస్సులో 50కి పైగా ఒప్పందాల ద్వారా సుమారు 5 లక్షల 75 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. ఒప్పందాల విలువకు, వాస్తవంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు మధ్య వ్యత్యాసం ఉంటుంది.

రెండో భారత్‌ సమ్మిట్‌తో ఏం సాధించవచ్చు?

రెండో భారత్‌ సమ్మిట్‌ వల్ల తెలంగాణకు ప్రధానంగా నాలుగు రకాల ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. రెండో భారత్‌ సమ్మిట్‌ వల్ల తెలంగాణకు ప్రధానంగా నాలుగు రకాల ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

1. అంతర్జాతీయ గుర్తింపు: 70 దేశాల నుంచి సుమారు 1,000 మంది ప్రతినిధులు రావడంతో హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతుంది.

2. పెట్టుబడులకు అవకాశం: ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పేస్‌ రంగాల్లో తెలంగాణ అవకాశాలను విదేశీ ప్రతినిధులకు పరిచయం చేయవచ్చు.

3. డిసెంబర్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు అనుసంధానం: భారత్‌ సమ్మిట్‌కు వచ్చే వ్యాపారవేత్తలు, ప్రతినిధులను డిసెంబర్‌ 7–9 తేదీల్లో జరిగే ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది.

4. స్థానిక వ్యాపారాలకు ఆదాయం: హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాబ్‌లు, ట్రావెల్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలకు తాత్కాలికంగా వ్యాపారం పెరిగే అవకాశం ఉంది.

ఈసారి భారత్‌ సమ్మిట్‌ను ప్రభుత్వం పెట్టుబడులకు కొత్త అవకాశాలు సృష్టించే వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పేస్‌, మౌలిక సదుపాయాల రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయవచ్చు. విదేశీ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో పరిచయాలు పెంచుకోవచ్చు.

ముఖ్యంగా డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరగనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌తో ఈ సదస్సును అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధులను డిసెంబర్‌ సమ్మిట్‌కు ఆహ్వానించడం ద్వారా పెట్టుబడుల చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఇక ఈ రెండు రోజుల సదస్సు వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాబ్‌లు, ట్రావెల్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలకు తాత్కాలికంగా వ్యాపారం పెరగవచ్చు. అయితే ఇవి తక్షణ ప్రయోజనాలు మాత్రమే. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా మేలు జరగాలంటే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలి.సదస్సుల వల్లే పెట్టుబడులు వస్తాయా?

ఈ అంశంపై సోలస్‌ మీడియా వ్యవస్థాపకులు డి. రామచంద్రమ్‌ కీలక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. “సదస్సులు నిర్వహించినంత మాత్రాన పెట్టుబడులు రావు. అయితే అవి కొత్త అవకాశాలకు వేదికలుగా నిలుస్తాయి. అంతర్జాతీయ వ్యాపార వర్గాలతో పరిచయాలు పెంచుతాయి. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశం కల్పిస్తాయి. ఈ పరిచయాలను క్షేత్రస్థాయిలో వాస్తవ ఫలితాలుగా ఎంత సమర్థవంతంగా మార్చగలుగుతామన్నదే అసలు ప్రశ్న” అని ఆయన విశ్లేషిస్తున్నారు.

పెట్టుబడుల సదస్సుల్లో భారీ మొత్తాల ఒప్పందాలు ప్రకటించడం సాధారణమే. కానీ వ్యాపార నిర్ణయాలు మారడం, ప్రాజెక్టులు ఆలస్యం కావడం, కొన్ని ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడం కూడా జరుగుతుందని ఆయన గుర్తుచేస్తున్నారు.

“ఒక సదస్సు విజయాన్ని కుదిరిన ఎంఓయూల విలువతోనో, ప్రకటించిన పెట్టుబడుల మొత్తంతోనో అంచనా వేయకూడదు. వాస్తవంగా వచ్చిన పెట్టుబడులు, ఏర్పాటైన పరిశ్రమలు, సృష్టించిన ఉద్యోగాల ఆధారంగానే విజయాన్ని కొలవాలి” అని స్పష్టం చేస్తున్నారు.

“ఒక సదస్సు ముగింపు కార్యక్రమంతో అసలు పని ముగియకూడదు. నిజానికి అప్పుడే అసలైన పని ప్రారంభం కావాలి” అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.భారత్‌ సమ్మిట్‌ హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపును పెంచే అవకాశం ఉంది. కొత్త వ్యాపార సంబంధాలకు పునాది వేయవచ్చు. కానీ ఆ పరిచయాలు పెట్టుబడులుగా, పరిశ్రమలుగా, స్థానిక యువతకు ఉద్యోగాలుగా మారినప్పుడే ఈ సదస్సుకు నిజమైన సార్థకత లభిస్తుంది.

ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? దానికి ప్రతిఫలంగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికినప్పుడే భారత్‌ సమ్మిట్‌ విజయాన్ని అంచనా వేయగలం.హైదరాబాద్‌ అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యం ఇచ్చే నగరంగానే కాకుండా, ఆ సదస్సుల ద్వారా వచ్చిన అవకాశాలను వాస్తవ పెట్టుబడులుగా మార్చుకునే నగరంగా ఎదుగుతుందా? వేచి చూడాలి.

Read More
Next Story