కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాల దండయాత్ర..
x

కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాల దండయాత్ర..

నిధుల వాటాలో కేంద్రం వివక్ష చూపుతోందా? దక్షిణాది నుంచి సేకరించిన డబ్బును ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెడుతుందా?


నిధుల వాటాలో కేంద్రం వివక్ష చూపుతోందా? దక్షిణాది నుంచి సేకరించిన డబ్బును ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెడుతుందా? సహనం కోల్పోయిన దక్షిణాది రాష్ట్రాల పాలకులు కేంద్రంపై దండయాత్రకు సిద్ధమయ్యారా?..అంటే అవుననే చెప్పాలి.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల 2024 - 2025 మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఏ శాఖకు ఎంత నిధుల కేటాయిస్తున్నారో వివరించారు.

అయితే నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు కర్ణాటక కాంగ్రెస్‌ ఎంపీ, డీకే సురేష్‌ గొంతెత్తారు. కేంద్రం వైఖరి ఇలాగే కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేక దేశం కోసం ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు.

డీకే సురేష్‌ ఒక్కడే కాదు. దక్షిణాది రాష్ట్రాల పాలకులు సైతం కేంద్రంపై కయ్యానికి సిద్ధమవుతున్నారు. నిధుల విడుదలలో కేంద్రం పక్షపాత థోరణి అవలంభిస్తోందంటూ ఆ పార్టీల ముఖ్యనేతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నారు.

ఢిల్లీలో గురువారం కేరళ లెఫ్ట్‌ ఫ్రంట్‌, తమిళనాడు డీఎంకే నేతలు వేర్వేరుగా ధర్నాకు దిగాయి.

పక్షపాత ధోరణి సరికాదన్న కేరళ సీఎం..

కేంద్రం పక్షపాత ధోరణి అవలంభిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆరోపించారు. కేంద్రం చర్యలు సహకారం సమాఖ్యవాదానికి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు.

రాష్ట్ర ఆర్థిక సమస్యలకు కేంద్రాన్ని నిందించడం సరికాదంటూ యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) ఎల్‌డీఎఫ్‌కు మద్దతు ఉపసంహరించుకుంది.

నల్లచొక్కాలు ధరించి..

తమిళనాడు సీనియర్‌ నేత టీఆర్‌ బాలు నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు పార్లమెంట్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నల్లరంగు చొక్కాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ విషయంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు తమకు మద్దతు తెలపాలని పార్లమెంటరీ పార్టీ లీడర్‌ టీఆర్‌ బాలు కోరారు. డిసెంబర్‌ 2023లో తమిళనాడులో భారీ తుఫాను కారణంగా సుమారు రూ. 37వేల కోట్లు నష్ట వాటిల్లిందని, తమను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా బడ్జెట్‌లో దానిపై ఒక్క ప్రకటన కూడా చేయడం పోవడం దారుణమని డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు, మధురైలో ఏర్పాటు చేయబోయే ఎయిమ్స్‌కు నిధుల కేటాయింపుపై ఒక్కమాట కూడా మాట్లాడలేదని అంటున్నారు.

జంతర్‌ మంతర్‌ వద్ధ కాంగ్రెస్‌ ధర్నా..

తమ రాష్ట్రానికి పన్నుల కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు బుధవారం (ఫిబ్రవరి 7)న జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.

దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లకు కేంద్రం దిగివస్తుందా? దక్షిణాది రాష్ట్రాలు విజయం సాధిస్తాయా? అన్నది వేచిచూడాల్సిందే.

Read More
Next Story