దానం, కడియంకు స్పీకర్ క్లీన్ చిట్
x

దానం, కడియంకు స్పీకర్ క్లీన్ చిట్

తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు.


పార్టీ ఫిరాయింపు అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతా వేటు పడుతుందనుకున్నా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. చాలా కాలంగా ఈ అంశం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది నాయకులను స్పీకర్ విచారించారు. కాగా వారిలో ఇదివరకే ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్.


అప్పుడు విచారణకు దానం, కడియం హాజరుకాకపోవడంతో వారి విచారణ ఇంకాలం కొనసాగింది. వారి విషయంలో స్పీకర్ తీర్పు ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం దానం, కడియంకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరిపైనా అనర్హత చర్యలు అవసరం లేదని స్పష్టం చేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తాత్కాలిక ముగింపు పడింది.

అసలు ఫిరాయింపు వివాదం ఎలా మొదలైంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ మార్పుల అంశం పెద్ద చర్చగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు తమ పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారారని, పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ స్పీకర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. వారిపై దశమ షెడ్యూల్ ప్రకారం అనర్హత విధించాలని డిమాండ్ చేశారు.

స్పీకర్ ముందుకు వచ్చిన పిటిషన్లు

ఫిరాయింపుల ఆరోపణలపై ప్రతిపక్ష నాయకులు స్పీకర్‌కు అధికారికంగా ఫిర్యాదులు సమర్పించారు. ఈ ఫిర్యాదుల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారారని, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పీకర్ కార్యాలయం వివరణ కోరుతూ సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు స్పందించిన దానం నాగేందర్, కడియం శ్రీహరి తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాము అధికారికంగా పార్టీ మారలేదని, అసెంబ్లీలో తమ హక్కుల మేరకు వ్యవహరించామని వివరించారు.

స్పీకర్ నిర్ణయం

పిటిషన్లు, ఎమ్మెల్యేల సమాధానాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో అనర్హతకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ ఇద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు అవసరం లేదని తేల్చారు. దీంతో వారికి క్లీన్ చిట్ లభించింది.

Read More
Next Story