అటవీశాఖకు సవాల్: పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల యత్నాలు
x
అటవీ గ్రామాల్లో పులి సంచారం : గ్రామస్థులు భయం భయం

అటవీశాఖకు సవాల్: పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల యత్నాలు

మూడు జిల్లాల్లో సంచరిస్తున్న పులి ఇప్పటికే 9 పశువులను చంపింది...


హైదరాబాద్ పరిధికి దగ్గరగా మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి వలస వచ్చి పశువులపై దాడులు చేస్తూ సాగిపోతున్న పులి గ్రామాల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. దీంతో అటవీశాఖ ప్రత్యేక బృందాలతో పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

పొరుగున ఉన్న మహారాష్ట్ర అడవి నుంచి తెలంగాణకు వలస వచ్చిన మగ పులి ఆవాసం కోసం అన్వేషిస్తూ రోజుకో ప్రాంతంలో తిరుగుతూ ఉంది. అటవీ ప్రాంతంలో తినేందుకు ఏమీ దొరక్క పోవడంతో పులి గ్రామాల్లోని పశువుల పాకలపై పడి ఆవులు, దూడలను చంపుతోంది. జింకలు వంటి వేట జంతువులు అడవిలో లేకపోవడంతో పులి పశువులపై దాడి చేస్తోందని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ వాలంటీర్ శ్రీపతి వైష్ణవ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తున్న పులి ఇప్పటికే 9 పశువులను చంపింది. పులి చంపిన పశువులకు అటవీశాఖ మూడు రోజుల్లోగా నష్టపరిహారం అందజేస్తుందని డీఎఫ్ఓ సుధాకరరెడ్డి చెప్పారు.

బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలు

యాభై ఏళ్ల తర్వాత మొదటి సారి హైదరాబాద్ నగర సమీపంలోకి వచ్చిన పులి ఈ ప్రాంత గ్రామాల్లో తిరుగుతుండటంతో గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో గడుపుతున్నారు. జీవవైవిధ్యం కోసం పులి పరిరక్షించేందుకు అటవీశాఖ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, పూణేకు చెందిన రెస్క్యూ టీం ప్రత్యేక బృందాలు, టైగర్ ట్రాకర్లు కలిసి కదిలాయి. పులిని సురక్షితంగా మత్తు మందు ఇచ్చి బంధించేందుకు ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. పులి కదలికలను కెమెరా ట్రాప్ లు, డ్రోన్ల సాయంతో చూస్తూ పులిని అడవిలోకి పంపించడం లేదా బంధించి దాన్ని దట్టమైన అడవిలో వదలాలని అటవీ అధికారులు యోచిస్తున్నారు.

పాండ్రకోడ అడవి నుంచి పులి వలస

పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పాండ్రకోడ అడవి నుంచి గత ఏడాది నవంబరు నెలలో పులి పెనుగంగా నదిని దాటి కవ్వాల పులుల అభయారణ్యంలోకి వలస వచ్చింది. ఈ పులి కవ్వాల అడవిలో కొన్నాళ్లు సంచరించి, అనంతరం జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల అటవీ గ్రామాల్లోకి వచ్చిందని తెలంగాణ వైల్డ్ లైఫ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఎ శంకరన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామంలో పులి పాదముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఏపీలో ఊపిరిపీల్చుకున్న ప్రజలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి వచ్చిన పులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించారు. రాజమండ్రి సమీపంలోని కూర్మాపురంలో ప్రాంతంలోని దుర్గమ్మ గుడి సమీపంలో పులిని రెస్క్యూ బృందాలు బంధించి రాజమండ్రికి తరలించడంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులుల్లో ఒకటి తెలంగాణ రాస్ట్రంలో సంచరిస్తూ పశువులపై వరుస దాడులు చేస్తుండటంతో దాన్ని ఎలాగైనా బంధించాలనే లక్ష్యంతో అధికారులు బోన్లను సైతం రంగంలోకి దించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం కుందారం , రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామాల్లో శుక్రవారం రాత్రి పులి సంచరించింది.జనవరి 17వతేదీన యాదాద్రి భువనగిరి జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం వద్ద మొదటి సారి కనిపించిన పులి మూడు జిల్లాల్లో తిరుగుతూ ప్రజలను ముప్పతిప్పలు పెడుతుంది.

పులికి హాని తలపెట్టొద్దు : అటవీశాఖ

జనగాం, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట సరిహద్దు గ్రామాల్లో పులి తిరుగుతున్నందున పొలాల్లో విద్యుత్ తీగలు లేదా ఉచ్చులు పెట్టవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.జనగాం జిల్లాలోని రఘునాథపల్లి మండలం మండెలగూడెం శివార్లలో పులి పాదముద్రలు కనిపించాయని అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లారు. ఈలోగా పులి మరో ప్రాంతానికి వెళ్లింది.పులి సంచారం నేపథ్యంలో లింగాల ఘన్‌పూర్, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగాం, దేవరుప్పుల మరియు తరిగొప్పుల మండలాల నివాసితులు చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లవద్దని హెచ్చరించినట్లు అటవీశాఖ అధికారి ఎ శంకరన్ చెప్పారు. రైతులు పశువులను వారి కొట్టాలు, షెడ్లలోపల సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు పేర్కొన్నారు. రైతులు పొలాల్లో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయవద్దని అధికారులు కోరారు.
Read More
Next Story