
45 కోట్ల గాలక్సీల్లోకి చూపుసారిస్తున్న నాసా
ఫిబ్రవరి 28న స్ఫియర్ ఎక్స్ ప్రయోగం
ఈ విశ్వం ఎలా పుట్టింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో భూమ్మీద ప్రాణి ఎలా జన్మించింది? అనేవి తరతరాలుగా మనిషి వేధిస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం మనిషి అన్వేషణ ఇపుడు విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది.
అంతులేని ఈ విశ్వంలో ఎక్కడో ఒక చోట ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్కుండా పోదా అనేది మనిషి ఆశ. ఈ లక్ష్యంతోనే ఆమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఫిబ్రవరి 28న అంతరిక్షంలోకి ఒక అబ్జర్వేటరీని ప్రయోగిస్తున్నది. దాని పేరు స్ఫియర్ ఎక్స్. స్పియర్ ఎక్స్ పూర్తి పేరు స్పెక్ట్రో ఫోటో మీటర్ ఫర్ ది హిస్టరీ అఫ్ ది యూనివర్స్ , ఈపాక్ అఫ్ రిఅయెనైజేషన్ అండ్ ఐసెస్ ఎక్స్ ప్లోరర్. (Spectro-Photometer for the History of the Universe, Epoch of Reionization and Ices Explorer).
కాలిఫోర్నియాలోని వాండెర్ బర్గ్ స్పెస్ ఫోర్స్ బేస్ నుంచి స్ఫియర్ ఎక్స్ ను ప్రయోగిస్తున్నారు. ఇది రెండేళ్ల పాటు అంతరిక్షంలో సంచరించే స్పెక్ట్రోస్కోప్. అంతరిక్షంలో ఉండే 450 మిలియన్ల గెలాక్సీలను, మన పాలపుంతలోని పదికోట్ల నక్షత్రాలను విశ్వజనన రహస్యాలకోసం శోధిస్తుంది. ఈ నక్షత్రాలనుంచి, గెలాక్సీల నుంచి వెలువడే 102 వర్ణాలను విశ్లేషించే శక్తి ఈ అబ్జర్వేటరీకి ఉంది. అంటే అంతరిక్షం వెదజల్లే వెలుతురును ఒడిపిపట్టి వడగట్టి అందులో విశ్వం పుట్టుక, ప్రాణిపుట్టుక అధారాలేమయిన దొరుకుతాయేమో నని ఈ స్ఫియర్ ఎక్స్ శోధిస్తుంది.
విశ్వరహస్యాలను చేధించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగాన్ని తప్పక తిలకించండి. స్ఫియర్ ఎక్స్ ప్రయోగం భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 28న ఉదయం 7 -7.30 మధ్య ఉండవచ్చు.