అమ్రాబాద్ అడవిలో ఆధ్యాత్మిక సందడి :
x
సలేశ్వరం జాతరలో భక్తుల రద్దీ

అమ్రాబాద్ అడవిలో ఆధ్యాత్మిక సందడి :

ఏప్రిల్ 1 నుంచి సలేశ్వరం జాతర. తెలంగాణ అమరనాథ్ యాత్రకు రంగం సిద్ధం,ఐదు లక్షల మంది భక్తుల రాకకు ఏర్పాట్లు


తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరుగాంచిన నల్లమల అరణ్యంలోని సలేశ్వరం జాతరకు నాగర్‌కర్నూల్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రకృతి సోయగాల నడుమ, జలపాతాల మధ్య వెలసిన లింగమయ్య స్వామి దర్శనం కోసం ఏప్రిల్ 1 నుంచి 3 వరకు లక్షలాది భక్తులు తరలిరానున్నారు.

శివనామ స్మరణతో మార్మోగనున్న సలేశ్వరం

తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరకు నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. కొండలు, గుట్టలు, జాలువారుతున్న జలపాతాలు, దట్టమైన అడవి మధ్యలో వెలసిన లింగమయ్య స్వామి ఆలయంలో సలేశ్వరం జాతర జరగనుంది.ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో కలిసి అమ్రాబాద్ అడవిలో కాలినడకన వెళ్లి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని నల్లమల అడవి సలేశ్వరం జాతర సందర్భంగా శివనామ స్మరణతో మార్మోగనుంది.

వస్తున్నా లింగమయ్య

సలేశ్వరం జాతర గత 30 సంవత్సరాలుగా కొనసాగుతోంది.సలేశ్వరం జలపాతం 200 అడుగుల ఎత్తు నుంచి ఏడాది పొడవునా ప్రవహిస్తుంది.లింగమయ్యగా పిలిచే శివలింగం పాదాలను చేరే విశిష్టమైన జలపాతం వద్ద ఈ జాతర సాగనుంది.ఏప్రిల్ మాసంలోని పౌర్ణమి రోజున భక్తులకు అతీంద్రియ శక్తులు లభిస్తాయని, వారి సంకల్పాలు నెరవేరతాయని నమ్ముతారు. భక్తులు వస్తున్నా లింగమయ్య అని జపిస్తూ పెద్ద సంఖ్యలో జాతరకు తరలి వస్తారు.

జాతరకు 5 లక్షల మంది భక్తులు

జాతర స్థలం అడవిలో కోర్ ఏరియా లోపల చాలా లోతులో ఉంది.మూడు రోజుల పాటు సాగనున్న జాతరకు 5 లక్షల మంది భక్తులు సందర్శించనున్నారు.ఫర్హాబాద్ గేట్ నుంచి 16 కిలోమీటర్ల వరకు వాహనాల్లో రోడ్డు ప్రయాణం చేసి, ఆ తర్వాత 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్, లోతైన లోయలోకి దిగాల్సి ఉంటుంది.జాతర సందర్భంగా పగలూ, రాత్రి వాహనాల రాకపోకలు ఉంటాయి.సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల వల్ల అడవులు, వన్యప్రాణులపై ప్రభావం చూపించకుండా అటవీశాఖ చర్యలు చేపట్టింది. వన్యప్రాణుల ఆవాసాలు విధ్వంసం కాకుండా ,పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోకుండా చర్యలు చేపట్టారు. టోల్ ఫీజు,ప్రవేశ టిక్కెట్లతో పాటు సందర్శకులందరికీ జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేయనున్నారు.అడవిలో జాతర సందర్భంగా చెత్తను తొలగించడానికి నాలుగు ట్రాక్టర్లను రంగంలోకి దించారు. 40 మంది వాలంటీర్లుగా స్థానిక చెంచు యువకులను నియమించారు.

జిల్లా కలెక్టర్ సందర్శన

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తాజాగా జిల్లా అధికారులతో కలిసి నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించి, జాతర ఏర్పాట్లు, ట్రెక్కింగ్ మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడవిలోని క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మరింత రద్దీ ఉండే అవకాశముందని కలెక్టరు పేర్కొన్నారు.

క్తులకు సౌకర్యాలు

భక్తుల సౌకర్యం కోసం తాగునీటి సరఫరా, వైద్య సేవలు, తాత్కాలిక శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమర్థంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.అడవి మార్గాల్లో దర్శనానికి వచ్చే భక్తుల కోసం స్పష్టమైన మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక సూచనలు ఉంచారు.శుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్తను నియంత్రించే చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. జాతర సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు వైద్య బృందాలు, అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోరారు.

భక్తుల భద్రతకు చర్యలు

పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. ఎవరైనా తప్పిపోయిన సందర్భంలో వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో స్వామి దర్శనం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
దట్టమైన అడవులు, కష్టసాధ్యమైన మార్గాల మధ్య సాగనున్న సలేశ్వరం జాతర భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలవనుంది. భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర చర్యలు తీసుకుంటుండగా, ఈసారి జాతర మరింత భక్తి వైభవంతో సాగనుందని స్పష్టమవుతోంది.
Read More
Next Story