గ్రౌండ్‌లో రెచ్చిపోయిన ఎమ్మెల్యేలు..
x

గ్రౌండ్‌లో రెచ్చిపోయిన ఎమ్మెల్యేలు..

ప్రజాప్రతినిధులతో క్రీడా పోటీలు ప్రారంభం. క్రీడాస్ఫూర్తి, యువతలో అవగాహనపై సీఎం సందేశం.


హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల స్పోర్ట్స్, కల్చరల్ మీట్-2026 ఘనంగా జరిగింది. తొలి రోజు మీట్‌లో టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, సాకర్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. కాగా సాకర్‌లో సీఎం రేవంత్ రెడ్డి మెరిశారు. నాలుగు గోల్స్ చేసి తనలోని స్పోర్ట్స్ మ్యాన్‌ను కనబరిచారు. ఆ తర్వాత నిర్వహించిన కబడ్డీ పోటీల్లో స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి సింగిల్ రైడ్‌లో నాలుగు పాయింట్లు సాధించారు.

క్రీడా పోటీల్లో లెమన్ అండ్ స్పూన్ విభాగంలో మంత్రి కొండా సురేఖ మొదటి స్థానం సాధించారు. ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, రాగమయి రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్యా స్పోర్ట్స్ మీట్ చాలా ఆహ్లాదకరంగా, రసవత్తరంగా సాగింది. ఈ స్పోర్ట్స్ మీట్ రెండో రోజు అంటే ఆదివారం క్యారమ్ బోర్డ్, చెస్, వాలీబాల్ సహా తదితర గేమ్స్ నిర్వహించనున్నారు.

ఈ స్పోర్ట్స్ మీట్‌ ప్రారంభం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్రీడలకు సరికొత్త ఊపు అందించడం కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. యువత క్రీడల్లో మరింత ఉత్సాహంతో పాల్గొనాలని, క్రీడలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రజా జీవితంలో నిరంతరం పనిచేసే వారికి క్రీడలు ఒక ఉపశమనం అని వివరించారు. ఎల్బీ స్టేడియం క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించేందుకు మంచి వేదికగా మారుతుందని పేర్కొన్నారు.

ఈ మైదానంలో శిక్షణ పొందిన పలువురు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారని గుర్తుచేశారు. క్రికెట్‌లో దేశానికి పేరు తీసుకువచ్చిన అజారుద్దీన్, రంజీ క్రికెట్ ఆడిన వాకిటి శ్రీహరి వంటి క్రీడాకారులు ప్రభుత్వంలో భాగమని తెలిపారు.

క్రీడలకు ప్రాధాన్యతపై దృష్టి

తెలంగాణ ఒకప్పుడు క్రీడల కేంద్రంగా నిలిచిందని సీఎం చెప్పారు. అయితే రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత క్రీడాస్ఫూర్తి తగ్గిందని పేర్కొన్నారు. దీనిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభను గుర్తించేందుకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్‌కు తీసుకురావడం ద్వారా నగర ఖ్యాతి పెరిగిందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనిపై వచ్చిన విమర్శలను ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు.

మౌలిక వసతుల అభివృద్ధి

ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంను ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తామని చెప్పారు. బేగంపేట హాకీ మైదానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. ఫామ్‌హౌస్‌లు, పబ్బుల వంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని చెప్పారు.

Read More
Next Story