ప్రశ్నోత్తరాల రద్దు వెనుక స్పోర్ట్స్ మీట్ కారణమా?
x

ప్రశ్నోత్తరాల రద్దు వెనుక స్పోర్ట్స్ మీట్ కారణమా?

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పోర్ట్స్ మీట్ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల రద్దు? వివరాలు తెలుసుకోండి.


తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం అంటే 28 మార్చి 2026 న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సెషన్‌ను రద్దు చేశారు. ప్రస్తుతం ఈ అంశం కీలక మారింది. అదో రోజున ప్రజాప్రతినిధులకు ఆటల పోటీలు నిర్వహించనుండటంతో ఇది మరింత చర్చకు దారితీసింది. ప్రజల సమస్యలకన్నా.. ఆటల పోటీలు ముఖ్యమయ్యాయా? అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. అసెంబ్లీ సెషల్ అయిపోయిన తర్వాత, సెషన్స్ లేని సమయంలో ఈ పోటీలను పెట్టుకోవచ్చు కదా? అన్న వాదన కూడా వినిపిస్తోంది.

ప్రజా ప్రతినిధులకు స్పోర్ట్స్ మీట్

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 28, 29 తేదీల్లో ఆటల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభలో ప్రకటించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తొలి విడత లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

కమిటీ ఏర్పాటు, బాధ్యతలు

ఈ కమిటీకి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఛైర్మన్‌గా నియమించినట్లు తెలిపారు. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కో-ఛైర్మన్‌గా నియమించినట్లు వెల్లడించారు. కన్వీనర్‌గా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ను నియమించగా, మరో 13 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమైన ఈ కమిటీ పోటీల నిర్వహణపై సమీక్ష చేసినట్లు తెలిసింది. ఈ నెల 28న మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో క్రీడలు ప్రారంభం కానున్నట్లు కమిటీ స్పష్టం చేసినట్లు తెలిపారు. అదే సమయంలో రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇదే రోజున జరగాల్సిన అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయాన్ని రద్దు చేసినట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటించిన విషయం తెలిసిందే. స్పీకర్ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీఏసీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రెండింటి మధ్య సంబంధం?

ప్రజా ప్రతినిధుల కోసం స్పోర్ట్స్ మీట్ నిర్వహణ, అదే రోజున ప్రశ్నోత్తరాల రద్దు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కార్యక్రమాల నిర్వహణ కారణంగా సమయ నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి అని సమాచారం. దీంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

Read More
Next Story