
హైదరాబాద్ మెట్రోరైలు : రెండో దశకు మోక్షం ఎప్పుడు?
హైదరాబాద్ మెట్రోరైలు ఫేజ్–2 నిధుల కోసం రాష్ట్రం ముమ్మర యత్నాలు
ఎయిర్‌పోర్ట్ లింక్‌తో మెట్రో విస్తరణ… ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర నిధులు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో 86.1 కిలోమీటర్ల విస్తరణ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి ఆమోదం కోరుతోంది.మెట్రో రైలు రెండో దశకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రాన్ని సంప్రదిస్తూ ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- మరో వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నాటికి మెట్రోరైలు నిర్వహణ బాధ్యతలను ఎల్ అండ్ టి నుంచి తెలంగాణ సర్కారు టేకోవర్ చేయనుంది.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలను 2024 జనవరి 4వతేదీన కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కు పంపించింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు కేటాయించాలని కోరుతూ తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి 2024 జనవరి 4వతేదీన లేఖ రిఫరెన్స్ నంబరు 10 పీఎస్ తో సీఎం కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
ఇవీ రెండో దశ మెట్రోరైలు ప్రతిపాదనలు
అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో మెట్రో రెండో దశ పనులకు రూ.19,579 కోట్లను మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది.శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి ఫ్యూచర్ సిటీ (స్కిల్స్ విశ్వవిద్యాలయం) వరకు 39.6 కిలోమీటర్ల దూరం మెట్రో కారిడార్ 9 విమానాశ్రయ లింక్ ను ప్రతిపాదించింది. సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల దూరం మెట్రోరైలు కారిడార్ 10ను , జూబ్లీ బస్ స్టేషన్ (JBS) నుంచి శామిర్‌పేట వరకు 22 కిలోమీటర్ల దూరం మెట్రోరైలు 11వ కారిడార్ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
మెట్రో రైలు రెండో దశ మూడు కారిడార్లలో 86.1 కిలోమీటర్ల దూరం కీలక మెట్రో కారిడార్లను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్ నెలలోనే పరిపాలనా ఆమోదం తెలిపింది.
కనెక్టివిటీని పెంచేందుకు...
హైదరాబాద్ నగరంలో కనెక్టివిటీని పెంచేందుకు హైదరాబాద్ మెట్రో రైలు ప్రతిపాదిత దశ రెండో దశ విస్తరణ దోహదపడనుంది. కొత్త మెట్రోరైలు వృద్ధి కారిడార్‌ల నిర్మాణం వల్ల నగరంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా చేయడంతోపాటు పెట్టుబడి ఆధారిత, పర్యావరణపరంగా స్థిరమైన మహానగరంగా వృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరించనుంది.ఈ ప్రాజెక్టు పూర్తి అయితే విమానాశ్రయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.దీంతోపాటు ప్రపంచ స్థాయి ప్రజా రవాణాతో ప్రపంచ నగరంగా హైదరాబాద్ నిలవనుంది.
కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. దీనిలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరిన అన్ని వివరాలను కూడా అందించిందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఈ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం ప్రతిపాదించిన ఉమ్మడి కమిటీలో ఇద్దరు అధికారులను నామినేట్ చేయాలని సీఎం కోరారు.మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు మోక్షం కల్పించాలని కోరుతూ గత ఏడాది నవంబర్ 18, మళ్లీ డిసెంబర్ 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రిని కలిశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రమంత్రికి ప్రతిపాదించారు.రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి,మెట్రోరైలు ఎండీని నామినేట్ చేసింది.
మార్చి నాటికి రాష్ట్రప్రభుత్వం చేతికి మెట్రోరైలు
హైదరాబాద్ మెట్రో రైలు కార్యకలాపాలను ఎల్ అండ్ టి నుంచి స్వాధీనం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నాటికి పరివర్తన ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.దీనిలోభాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సమీక్షించారు.ఎల్ అండ్ టి కార్యదర్శులు, అధికారుల కమిటీతో జరిగిన సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం పరివర్తన పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభించినప్పటి నుండి నగరంలో కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థగా ఉంది. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు యొక్క కార్యాచరణ నియంత్రణలో టేకోవర్ గణనీయమైన మార్పును సూచిస్తుంది.
ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ బస్సుల అనుసంధానం
ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైలు, టీజీఎస్ ఆర్టీసీ బస్సు సేవలను అనుసంధానిస్తూ సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించేందుకు తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రారంభించింది. నగర ప్రయాణికులకు మొదటి,చివరి మైలు కనెక్టివిటీని మెరుగుపరచడం, రహదారి రద్దీని తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంపొందించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు. హైదరాబాద్‌లో మల్టీమోడల్ రవాణా వ్యవస్థ దిశగా ఇది కీలక ముందడుగు కానుంది. ఇందులో భాగంగా 51 ఎంఎంటీఎస్ స్టేషన్ల చుట్టుపక్కల అనుసంధాన రహదారులను విస్తరించాలని జీహెచ్‌ఎంసీని ప్రభుత్వం కోరింది. బస్‌స్టాప్‌లను ఎంఎంటీఎస్ స్టేషన్లకు మరింత దగ్గరగా మార్చడం,మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులన్నింటికీ వర్తించే సమగ్ర టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
మొత్తానికి, మెట్రో రైలు రెండో దశకు కేంద్రం ఆమోదం లభిస్తే హైదరాబాద్ నగర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కనెక్టివిటీ పెరగడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.కేంద్రంతో జరుగుతున్న చర్చలు ఫలిస్తే మెట్రో ఫేజ్–2కు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు అందరి చూపు కేంద్ర నిర్ణయంపైనే నిలిచింది.
Next Story

