కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వాలి: రాష్ట్ర మంత్రుల డిమాండ్
x
మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వాలి: రాష్ట్ర మంత్రుల డిమాండ్

బడ్జెట్ ముందు కేంద్రంపై తెలంగాణ ఒత్తిడి


2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్ ,దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏమన్నారంటే...

కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణకు నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు.

తెలంగాణకు అన్యాయం చేయొద్దు : మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్న బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేయవద్దని పొన్నం కోరారు. తాము ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు, కేంద్ర మంత్రులకు తెలంగాణ తరపున ప్రాధాన్యతలను తెలిపామని మంత్రి చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగితే బీజేపీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గత దశాబ్ద కాలంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ పట్ల అన్యాయంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.‘‘తెలంగాణ నుంచి బీజేపీకి ప్రస్తుతం ఎనిమిది మంది బీజేపీ సభ్యులు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణను నిరంతరం నిర్లక్ష్యం చేస్తోంది. బడ్జెట్‌లో మన రాష్ట్రానికి న్యాయం జరగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని పొన్నం వ్యాఖ్యానించారు.తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య రేడియల్ రోడ్లు, మూసీ నదీ అభివృద్ధి, హైదరాబాద్ మెట్రో రైలు, హైదరాబాద్ విమానాశ్రయం గ్రీన్‌ఫీల్డ్ హైవే, విమానాశ్రయ విస్తరణ, రైల్వే ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.

ఆర్థికసర్వేలో తెలంగాణ పురోగతి : మంత్రి శ్రీధర్ బాబు

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో తెలంగాణ పురోగతి సాధించిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. గత రెండేళ్లలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. బురద రాజకీయాలు మాని తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. 2024-25 లో తెలంగాణ మెరుగైన పనితీరు కనబర్చిందన్నారు.బడ్జెట్ లో తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులివ్వాలని మంత్రి కోరారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన 2025–26 ఆర్థిక సర్వే తెలంగాణ బలమైన ఆర్థిక పనితీరు, పారదర్శక పాలన ,సర్వతోముఖ పురోగతికి తిరుగులేని సాక్ష్యంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Read More
Next Story