సుంకాల మోతతో పతనమైన స్టాక్ మార్కెట్లు
x

సుంకాల మోతతో పతనమైన స్టాక్ మార్కెట్లు

భారత్ తో పాటు 70 దేశాలపై టారిఫ్ లు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్


ట్రంప్, భారత్ పై విధించిన సుంకాలతో స్టాక్ మార్కెట్లు అయిన సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్ లో క్షీణించాయి. టారిఫ్ భయాలకు తోడు విదేశీ నిధులు కూడా తరలిపోవడంతో ఈ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. బీఎస్సీ లో ప్రారంభంలోనే 111.17 పాయింట్లు క్షీణించి 81,074.41 ప్రారంభం కాగా, నిఫ్టీ కూడా 33.45 పాయింట్లు క్షీణించి 24,734.90 పాయింట్లతో నడుస్తోంది.

భారత్ పై 25 శాతం సుంకాలు విధించడంతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలపై ట్రంప్ పరిపాలన విభాగం సుంకాలు విధించడంతో అనేక దేశాల స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడింది. జూన్ 30, 2025 నాటికి ముగిసిన మొదటి క్వార్టర్ లో సన్ ఫార్మా కంపెనీ తన లాభంలో 20 శాతం నికర ఆదాయాన్ని కోల్పోయి రూ. 2,279 కోట్లకు చేరింది. ఈ గ్రూపుకు చెందిన షేర్లు కూడా సెన్సెక్స్ ట్రేడింగ్ లో 5 శాతం నష్టాలను చవిచూశాయి. మహీందా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హిందూస్థాన్ యూనీలివర్, ఐటీసీ, ఏసియా పెయింట్స్ మాత్రం లాభాలు పొందాయి.

ట్రంప్ ప్రపంచంలోని 70 దేశాలపై సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. భారత్ పై 25 శాతం సుంకాలు, పెనాల్టీ విధిస్తానని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఆయన విడుదల చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో భారత్ పై పెనాల్టీ విధించే అంశాలు కనిపించలేదు. రష్యా నుంచి ఆయుధాలు, చమురును కొనుగోలు చేసినందుకు భారత్ పై సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
సుంకాల యుద్దం మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో ఫారెన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్(ఎఫ్ఐఐ) రూ. 5,588.91 కోట్లను గురువారం ఉపసంహరించుకున్నారు. ‘‘జూలై నెలలో మార్కెట్ 3.1 శాతం నష్టాలతో ఉంది. ఆగష్టు కూడా ఇదే విధమైన బలహీన సంకేతాలతో ప్రారంభం అయింది. టారిఫ్ ల భయంతోనే ఇది జరిగింది. ఆగష్టు 7 నాటికి సవరించిన టారిఫ్ లను విధిస్తారనే ప్రచారం జరగుతోంది. రెండు దేశాలు చర్చలు జరపబోతున్నాయి కానీ ఫలిస్తాయా తెలియదు’’ అని జియోజిత్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ చీఫ్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
‘‘ నిన్నటి మార్కెట్ ప్రతిస్పందన చూస్తే టారిఫ్ లను స్వల్పకాలిక చర్యగా భావించింది. చర్చల తరువాత టారిఫ్ లు తగ్గే అవకాశం ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎఫ్ఐఐల తరలింపు మాత్రం ఆశాజనకంగా ఉండదని అభిప్రాయపడ్డారు. ఆసియాలోని సౌత్ కొరియా, జపాన్, హాంకాంగ్ మార్కెట్లు అన్ని కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. గురువారం ముగిసిన అమెరికా మార్కెట్లు సైతం నష్టాలనే మూటగట్టుకున్నాయి.
‘‘ట్రంప్ సుంకాల మోత, హవ్ కిష్ ఫెడ్ సిగ్నల్, క్యూ1 ఆదాయాలు, ఎఫ్ఐఐల అమ్మకాలు, సాంకేతిక అంశాల్లో క్షీణత’’ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అవ్వడానికి కారణాలని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సీ అభిప్రాయపడ్డారు.
టారిఫ్ ల దెబ్బతో ముడి చమురు ధరలు కూడా పతనమయ్యాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.97 శాతం క్షీణించి 72.53 డాలర్లకు చేరుకున్నాయి. గురువారం సెనెక్స్ 296.28 పాయింట్లు లేదా 0.36 శాతం క్షీణించి 81,185.58 పాయింట్ల వద్ద, నిఫ్టీ 86.70 పాయింట్స్ లేదా 0.35 శాతం నష్టపోయి 24,768 పాయింట్లు దగ్గర నిలిచింది.
Read More
Next Story