
మంచిరేవుల బీరప్పగుడి గుట్ట మీద పురాతన రాతిపని ముట్టు
పాత రాతియుగం పనిముట్టు దొరకడం ఈ ప్రాంత పురాతత్వానికి నిదర్శనం
తెలంగాణ మంచిరేవుల ఎదురుగా రోడ్డవతల బీరప్పగుడి వెనక(TSIIC-311)గుట్ట మీద శిలాశ్రయం దగ్గర ఒక క్వార్ట్జ్ పనిముట్టును కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ రాతి పనిముట్టు 7సం.మీ.ల పొడవు, 11సెం.మీ.ల చుట్టుకొలతలతో ఉన్నది. ఆ పనిముట్టు ఫోటోను చూసిన ప్రొ.రవికొరిసెట్టర్ (ధార్వార్ యూనివర్సిటి) అది ఎగువ పాతరాతియుగం (Upper Palaolithic) Quartz Point అని చెప్పారు. ఈ ఎగువ పాతరాతియుగం ఇండియాలో 40,000-10,000 సం.ల మధ్యకాలంలో ఉంటుంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ వైస్ ప్రసిడెంట్ మీర్ ఒమర్ అలీఖాన్ క్షేత్ర పరిశోధన చేశారు.
పాతరాతియుగం పనిముట్టు దొరకడం ఈ ప్రాంత పురాతత్వానికి నిదర్శనం. ఈ మంచిరేవుల(TSIIC-311) గుట్ట మీద పరిశోధన చేస్తే ఇంకా చరిత్రపూర్వయుగ విశేషాలు వెలుగుచూసే అవకాశం ఉన్నది. రాతి పనిముట్లు మానవ నాగరికతా సంస్కృతుల వికాసానికి రుజువులు. భారతదేశంలో 15లక్షల సం.రాల కిందటి రాతిపనిముట్లు లభించడం విశేషం. తెలంగాణాలో కొత్త తెలంగాణచరిత్రబృందం అన్వేషణలో ఇప్పటికి పాతరాతియుగం పనిముట్లు పదుల సంఖ్యలో లభించాయి. కాని, హైద్రాబాద్ పరిసరాల్లో పాతరాతియుగం పనిముట్టు దొరకడం చెప్పుకోదగిన చారిత్రక విశేషమని వారు చెప్పారు.
ఈ పనిముట్టు లభించిన పరిసరాల్లో ఒక గుహవంటి శిలాశ్రయం ఉన్నది. అది పురామానవులకు ఆవాసమై వుంటుంది. వానలకు కొట్టుకుపోయి పేరుకున్న మట్టిపొరలున్నాయి. వీటిలో స్తరీకరణ ప్రకారం పద్ధతిగా పరిశోధిస్తే మరిన్ని పురామానవుల రాతిపనిముట్లు దొరికే వీలున్నది.
ఎగువ పాతరాతియుగంలో పురామానవులు క్వార్ట్జైట్, క్వార్ట్జ్, ఛెర్ట్ (quartz, quartzite, and chert) రాళ్ళతో పనిముట్లు చేసుకునేవారు. ఇపుడు లభించిన క్వార్ట్జ్ పాయింట్ చిన్న రాతిగొడ్డలి వలె కనిపిస్తున్నది. ఈ పాతరాతియుగం పనిముట్టు లభించడం హైద్రాబాద్ చరిత్రలో ఒక మైలురాయి.
Next Story

