
రిగ్గింగ్ జరుగుతోందంటే ఎన్నికలకు దూరంగా ఉండండి: దీప్కే
ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని తెలిసినపుడు పోటీ చేయడం ఎందుకని అభిజీత్ దీప్కే విపక్షాలను ప్రశ్నించారు. ఫిక్స్‌డ్ మ్యాచ్‌తో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నట్లయితే.. ప్రతిపక్ష పార్టీలు ఆ ఎన్నికల్లో పోటీ చేయడం మానుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కోరారు. రిగ్గింగ్ జరుగుతోందని తెలిసినా ఎన్నికల్లో పోటీచేయడం అంటే ఆ ఎన్నికలకు విపక్షాలే చట్టబద్ధత కల్పించినట్లవుతుందని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయనే భ్రమ నుంచి బయటపడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు దూరంగా ఉంటే తమ రాజకీయ ఉనికే ప్రమాదంలో పడుతుందనే భయంతోనే ప్రతిపక్షాలు పోటీ చేస్తున్నాయా? అని ఎక్స్ లో ప్రశ్నించారు.
‘ఫిక్స్‌డ్ మ్యాచ్’తో ఎన్నికలకు పోలిక
తన వాదనను స్పష్టంగా చెప్పేందుకు.. ఎన్నికలను ఫిక్స్‌డ్ క్రికెట్ మ్యాచ్‌తో పోల్చారు అభిజీత్. మ్యాచ్ ఫిక్సింగ్ ముందే జరిగినా.. ప్రతి క్యాచ్‌ను వదిలేయరని, కొన్ని క్యాచ్‌లు పట్టి, మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్నట్లు చూపించవచ్చని అన్నారు. అదే విధంగా.. కొన్నిచోట్ల విపక్షాలు గెలవొచ్చని, ఆ చిన్నపాటి విజయాలే మొత్తం ఎన్నికల ప్రక్రియకు చట్టబద్ధత ఉన్న భ్రమలో ఉండకూడదని అన్నారు.
జ్ఞానేష్ రాజీనామాకు డిమాండ్..
జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని దీప్కే ఇప్పటికే డిమాండ్ చేశారు. అలా జరగకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని.. ‘జంతర్ మంతర్ 2.0’ నిర్వహిస్తామని హెచ్చరించారు.
అభ్యంతరాలపై చర్చ.. ఈసీ వివరణ..
గత 10 నెలల్లో ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణకు సంబంధించిన విషయాల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం SIRతో సహా అన్ని నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతున్నాయి. చర్చల సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సహజమేనని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో.. ఒకవైపు ఎన్నికల ప్రక్రియపై రాజకీయ ఆరోపణలు.. మరోవైపు ఎన్నికల సంఘం వివరణ.. ఈ రెండింటి మధ్య వివాదం మరింత ముదురుతోంది.
