Ragging
x

కాకతీయ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఏడుగురికి శిక్ష

అసలు ర్యాగింగ్ వ్యతిరేక చట్టం ఏం చెప్తుంది?


వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. రెండు వేరు వేరు ఘటనలకు సంబంధించి విచారణ అనంతరం వారికి శిక్ష విధించాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే ర్యాగింగ్.. ఇది తప్పు. చాలా కాలేజీల్లో ఎందరో విద్యార్థులు దీని బారిన పడి తమ ప్రాణాలు కోల్పోయారు. కానీ దీనిని పూర్తిగా నశింపజేయడం కలగానే మారింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ ర్యాగింగ్ మహమ్మారి అధికారుల కళ్లుగప్పుతూ కాలేజీల్లో బసచేస్తూనే ఉంటుంది. ర్యాగింగ్ తప్పని అందరికీ తెలుసు. కానీ ఎందుకు తప్పు? ర్యాగింగ్ చేస్తే చట్టం ఎలా శిక్షిస్తుంది? ఎలాంటి చర్యలు ఉంటాయి అనేవి చాలా మందికి తెలీదు. దానికితోడు చాలా మంది విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడిన వారు.. ఎవరికి ఫిర్యాదు ఇవ్వాలో తెలియక లోలోపల అణుక్షణం బాధపడుతుంటారు. మనల్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తే.. ప్రిన్సిపాల్, యూనివర్సిటీ అయితే వైస్ ఛాన్సలర్, ఛాన్సర్‌లకే ఫిర్యాదు చేయాలా? మరెక్కడా చేయకూడదా?

వరంగల్ ఘటన ఏంటి ?

కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌కు సంబంధించిన రెండు ఘటనలపై కీలక పరిణామం చోటు చేసుకుంది. సుమారు ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ నిర్ణయించుకుంది. ఈ చర్యలు సంస్థలోని యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ అనంతరం అమలులోకి వచ్చాయి. మొదటి ఘటనలో, మూడో సంవత్సరం విద్యార్థులు సోషల్ మీడియా వ్యాఖ్యల నేపథ్యంలో జూనియర్‌లను మోకాళ్లపై కూర్చోబెట్టినట్లు ఫిర్యాదు నమోదైంది. దీనిపై కమిటీ విచారణ జరిపి, సంబంధిత విద్యార్థులకు మూడు నెలల సస్పెన్షన్ విధించడంతో పాటు హాస్టల్ సదుపాయాలను శాశ్వతంగా రద్దు చేసింది.

ఇక రెండో ఘటన ఏప్రిల్ 8న చోటుచేసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రాక్టికల్ ల్యాబ్‌లో తలెత్తిన వివాదం తర్వాత, బీఎస్సీ రేడియాలజీ మొదటి సంవత్సరం విద్యార్థిని రెండో సంవత్సరం విద్యార్థులు వేధించినట్లు సమాచారం. డ్యూటీ అయిపోయిన తర్వాత సదరు బాధిత విద్యార్థిని కాలేజీ సమీపంలో ఉన్న భద్రకాళి దేవాలయ ప్రాంగణానికి పిలిపించి అక్కడ దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుడు కుటుంబంతో కలిసి మాటేవాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. అయితే, ఇది ర్యాగింగ్‌కు సంబంధించిన విషయం కావడంతో ప్రిన్సిపాల్‌కు తెలియజేయాలని పోలీసులు సూచించారు. వారు ప్రిన్సిపాల్‌కు విషయం తెలియజేయడంతో ఆయన తదుపరి చర్యలు తీసుకుని విచారణ జరిపించారు. అందులో వారు ర్యాగింగ్ చేసినట్లు నిర్దారణ కావడంతో శిక్షకు ఉపక్రమించారు.

అసలు ర్యాగింగ్ అంటే ఏంటి?

సుప్రీంకోర్టు ప్రకారం.. ఒక విద్యార్థిని మాటలతో కానీ, రాతలతో కానీ, మరే ఇతర టీజింగ్ వంటి చర్యలు, తోటి విద్యార్థితో రూడ్‌గా ప్రవర్తించడం వంటివి చర్యలను ర్యాగింగ్‌గా పరిగణించబడతాయి. దాంతోపాటుగానే రౌడీలా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం, ఆ చర్యల ద్వారా గందరగోళం ఏర్పడటాన్ని కూడా ర్యాగింగానే భావించాల్సి ఉంటుంది. వాటితోపాటుగా తమ చర్యల ద్వారా కొత్త, జూనియర్ విద్యార్థులకు కష్టం కలిగించినా, మానసికంగా వేధించినా, భయం కలేగేలా చేసినా ర్యాగింగ్ చేసినట్లే. జూనియర్ల చేత పనులు చేయించుకోవడం, వాళ్లని అవమానించేలా ప్రవర్తించడం, అవహేళన చేయడం కూడా ర్యాగింగ్ కిందకే వస్తుంది. వీటితో పాటుగానే..

  • ఇతర విద్యార్థులతో కొత్తగా చేరిన విద్యార్థిపై లేదా మరే ఇతర విద్యార్థిపై అయినా ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావడం, వారి దగ్గర బలవంతంగా డబ్బులు తీసుకోవడం, బలవంతపు ఖర్చు భారాన్ని మోపడం కూడా ర్యాగింగే అవుతుంది.
  • లైంగిక వేధింపులు, స్వలింగ సంపర్క దాడులు, బట్టలు విప్పించడం, అసభ్యకరమైన, అశ్లీలమైన చర్యలు, సంజ్ఞలు చేయమని బలవంతం చేయడం, శారీరక హాని లేదా ఆరోగ్యానికి లేదా వ్యక్తికి ఏదైనా ఇతర ప్రమాదం కలిగించడం వంటి అన్ని రకాల శారీరక దుర్వినియోగ చర్యలు ర్యాగింగ్ కిందకే వస్తాయి.
  • మాటల ద్వారా, ఈ-మెయిల్స్, పోస్టులు లేదా బహిరంగ అవమానాల ద్వారా చేసే ఏదైనా చర్య లేదా దుర్వినియోగం, ఇందులో వికృతమైన ఆనందాన్ని పొందడం, పరోక్ష లేదా సాడిస్టిక్ థ్రిల్ పొందడం, అధికారం, హోదా లేదా ఆధిక్యతను ప్రదర్శించడం కూడా ర్యాగింగ్‌గా భావించాలి.

చట్టం ప్రకారం శిక్షలు..

ర్యాగింగ్‌ అంశంలో పోలీసులు, లీగల్ యాక్షన్‌కు అవకాశం ఉంది. భారతదేశ చట్టం ప్రకారం ర్యాగింగ్ అనేది శిక్షించదగిన నేరం. ర్యాగింగ్ అంశాల్లో విధించే శిక్ష ఒక ఉదాహరణగా, సమర్థించుకోగలిగేంత కఠినంగా కూడా ఉండాలని సుప్రీంకోర్టు చెపప్పింది. ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్‌ల ప్రకారం.. ర్యాగింగ్ కేసులో దోషిగా నిర్ధారితమైన వ్యక్తికి సంబంధిత సెక్షన్ల కింద జైలు శిక్షణ లేదా జరిమానా ఉంటుంది. కొన్ని సందర్బాల్లో రెండూ కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. శిక్ష నేర తీవ్రతను బట్టి విధించబడుతుంది. ఉదాహరణకు సెక్షన్ 323 ప్రకారం.. ఒకరిని బాధించడం, వారికి గాయం అయ్యేలా చేయడం వంటివి కేసుల్లో ఏడాది జైలు, జరిమానా కొన్ని సందర్భాల్లో రెండూ ఉంటాయి. సెక్షన్ 306 ప్రకారం.. బాధితులు ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లిసందర్బాల్లో దీనిని చేరుస్తారు. దీని కింద దోషికి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతో పాటుగానే ర్యాంగిగ్ కేసుల్లో.. చర్యలను బట్టి సెక్షన్ 341 (బంధించడం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపులు), సెక్షన్ 302 (హత్య), సెక్షన్ 307 (హత్యాయత్నం) సహా మరికొన్ని సెక్షన్లను కూడా జోడించడం జరుగుతుంది.

యూజీసీ నిబంధనలు

యూజీసీ 2009 నిబంధనల ప్రకారం, ర్యాగింగ్‌పై దేశవ్యాప్తంగా జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉంది. ప్రతి విద్యాసంస్థ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ర్యాగింగ్‌ను నిరోధించడం, అరికట్టడం, పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఈ నిబంధనలను పాటించని సంస్థలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఫిర్యాదు ఎలా చేయాలి?

ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు నేషనల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌ 1800-180-5522(టోల్ ఫ్రీ)ను సంప్రదించవచ్చు. ఈ సేవ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇమెయిల్ helpline@antiragging.in. ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో యూజీసీ మానిటరింగ్ ఏజెన్సీ antiragging@c4yindia.org ని సంప్రదించడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చు. ఎమర్జెన్సీ సందర్భాల్లో 011-41619005 లేదా 98180 44577 లను సంప్రదించవచ్చు.

Read More
Next Story