పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థిని మృతి
x

పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థిని మృతి

రెండు బైకులు ఢీకొట్టుకున్న ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు.


పరీక్షకు బయలుదేరిన క్షణాల్లోనే విధి వెక్కిరించింది. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని హంసలేఖ రోడ్డు ప్రమాదంలో లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం విషాదాన్ని నింపింది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన బందెల నర్సింహ కుమార్తె హంసలేఖ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మంగళవారం పరీక్ష ఉండటంతో బాటసింగారం‌లోని అన్నమాచార్య కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి ఆమె తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.

ఈ క్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో లారీని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఎదురుగా వస్తున్న మరో బైక్ హంసలేఖ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో హంసలేఖ బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోగా, వెనుక నుంచి వస్తున్న లారీ ఆమెపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

అదే ప్రమాదంలో హంసలేఖతో పాటు ప్రయాణిస్తున్న స్నేహితుడితో పాటు మరో బైక్‌పై ఉన్న దీప్తి, సాయిగణేశ్, భానుప్రకాష్ అనే విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో హంసలేఖ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్ష రాసి ఉన్నత భవిష్యత్తు సాధిస్తుందన్న ఆశలు ఒక్కసారిగా అడియాసలవ్వడంతో కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. కళాశాల వర్గాలు కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

Read More
Next Story