
తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్ల.. స్టూడెంట్ లీడర్ నుంచి ఈ స్థాయి వరకు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లను తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ఆయన రాజకీయ ప్రయాణం, కీలక పదవులు, సేవల వివరాలు.
దేశవ్యాప్తంగా గవర్నర్ బదిలీలు జరగడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత శివప్రతాప్ శుక్లా.. నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆయనను తెలంగాణకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్ మార్చి 5న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. ఈ నియామకంతో శివ ప్రతాప్ శుక్ల తెలంగాణకు ఐదో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ క్రమంలోనే అసలు శుక్లా ఎవరు? ఆయన నేపథ్యం ఏంటి? అనేది కీలకంగా మారింది. స్టూడెంట్ లీడర్‌గా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం ఇప్పుడు గవర్నర్ పదవి వరకు చేరింది. 1952 ఏప్రిల్ 1న ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ జిల్లా రుద్రాపూర్ ప్రాంతంలో శివ ప్రతాప్ శుక్ల జన్మించారు. గోరఖ్‌పూర్‌లోనే న్యాయ విద్య పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో చేరి కార్యకర్తగా పనిచేశారు. అక్కడే సంఘటన్ మంత్రి బాధ్యతలు కూడా నిర్వహించారు. విద్యార్థి రాజకీయాల ద్వారా ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు.
1983లో భారతీయ జనతా పార్టీలో చేరిన తరువాత రాజకీయంగా మరింత చురుకుగా మారారు. గోరఖ్‌పూర్ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 1989లో మొదటిసారి గోరఖ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత 1991, 1993, 1996లో వరుసగా నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో జైలు శాఖ, న్యాయశాఖ, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం సంపాదించిన ఆయన 2016లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
అనంతరం 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యసభ సభ్యుడిగా 2022 జూలై వరకు కొనసాగిన ఆయన తరువాత 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అక్కడ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన తరువాత ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, సి.పీ. రాధాకృష్ణన్, జిష్ణు దేవ్ వర్మ ఈ పదవిని నిర్వహించారు.
ఇప్పుడు శివ ప్రతాప్ శుక్ల ఐదో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన గవర్నర్ మార్పుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా పలు నియామకాలు జరిగాయి. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. ఢిల్లీకి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ అమెరికా రాయబారి తరంజిత్ సింగ్ సందును నియమించారు. ఈ మార్పులు పరిపాలనా వ్యవస్థలో భాగంగా జరిగినవని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కొత్త గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్ల త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

