
పిల్లల వేసవి సెలవులు గ్యాడ్జెట్స్‌తో కాదు.. పేరెంట్స్‌తో గడవాలి: సజ్జనార్
పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైమ్‌పై హెచ్చరిక. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు.
స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఈ సెలవులను ఎలా గడపాలని చాలా మంది చాలా ప్లాన్స్ వేస్తుంటారు. కాగా చిన్నారుల తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్.. ఇదే విషయంపై కీలలక సూచనలు చేస్తున్నారు. వేసవి సెలవులు అనేవి ఆటపాటలతో గడవాలి కానీ సెల్ ఫోన్, టీవీ స్క్రీన్‌లతో కాదని అన్నారు. చిన్నపిల్లలు ఈ వేసవిలో ఆడుతూ పాడుతూ ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలని అన్నారు. డిజిటల్ స్క్రీన్లకు పిల్లలు అతుక్కుపోకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
రానురాను పిల్లలు డిజిటల్ స్క్రీన్లకు అడిక్ట్ అయిపోతున్నారని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు ఏడుస్తున్నారో, మన పన్లకు అడ్డురాకుండా ఉంటారనో ఇలా ఏదో ఒక కారణంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతిలో ఫోన్ పెట్టేస్తున్నారని, కానీ అది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ‘‘ఒకప్పుడు వేసవి అంటే గ్రామాలు, ఆటలు, సందడి గుర్తొచ్చేవి. ఇప్పుడు మాత్రం చిన్నారుల ప్రపంచం మొబైల్ ఫోన్లకే పరిమితమవుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పు బాల్యంలో సహజత్వాన్ని తగ్గిస్తున్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారని గుర్తు చేశారు.
‘‘తల్లిదండ్రులు బిజీగా ఉండటం వల్ల పిల్లలకు సరైన సమయం ఇవ్వలేకపోతున్నారు. దీంతో వారు డిజిటల్ ప్రపంచంలో ఎక్కువగా మునిగిపోతున్నారు’’ అని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెరుగుతున్నాయని, రీల్స్ వ్యసనం పిల్లల నిద్ర, ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక స్క్రీన్ వినియోగం ఒంటరితనం, ఆందోళనకు దారితీస్తోంది. కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోవడం ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ఇటీవల చిన్న విషయాలకు మనస్తాపం చెంది ఇళ్లను వదిలి వెళ్లే ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలు కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
పిల్లలు ఇంటర్నెట్‌లో ఏమి చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న విషయాలను తల్లిదండ్రులు గమనించాలని సజ్జనార్ సూచిస్తున్నారు. స్క్రీన్ టైమ్‌కు పరిమితులు పెట్టడం అవసరమని అన్నారు. పరీక్షల ఫలితాల సమయంలో పిల్లలకు మానసిక బలం ఇవ్వాలని, ఒత్తిడి పెంచకుండా మార్గనిర్దేశం చేయాలని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి, ఈ వేసవిలో పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే తల్లిదండ్రులతో గడిపే సమయమే చాలా ముఖ్యమని సజ్జనార్ సూచించారు. సరైన దిశలో తీసుకునే చర్యలు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

