ఫిరాయింపు నేతల కేసులో సుప్రీం కీలక నిర్ణయం !
x

ఫిరాయింపు నేతల కేసులో సుప్రీం కీలక నిర్ణయం !

స్పీకర్ తీర్పు అనంతరం సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తర్వాత కేసు అధికారికంగా డిస్పోజ్ చేసిన ధర్మాసనం.


తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సుప్రీంకోర్టు అధికారికంగా ముగించింది. స్పీకర్ ఇప్పటికే తీర్పు ప్రకటించిన నేపథ్యంలో కేసును డిస్పోజ్ చేసినట్లు ధర్మాసనం తెలిపింది. ఇటీవల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ పూర్తి చేసి తీర్పు ఇచ్చినట్లు స్పీకర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ ముగించామని వారు ధర్మాసనానికి తెలిపారు. దీంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది.

ఈ విచారణను జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌ల ధర్మాసనం పరిశీలించింది. తీర్పు ప్రతులను రేపటిలోగా పిటిషనర్లకు పంపాలని, అలాగే ఐదు రోజుల్లో ఇతర సంబంధిత పత్రాలను అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందార్, కడియం శ్రీహరి పార్టీ మారినట్లు నిరూపించే సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిపై దాఖలైన రెండు పిటిషన్లను తిరస్కరించారు.

దీంతో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లైంది. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కూడా స్పీకర్ అనుకూల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ కేసులో గురువారం వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఆ గడువు నేపథ్యంలో స్పీకర్ బుధవారం తుది తీర్పును వెల్లడించారు. ఈ పరిణామంతో స్పీకర్ పరిధిలో కొనసాగిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుకు పూర్తి విరామం లభించినట్లు తెలుస్తోంది.

Read More
Next Story