
తెలంగాణ గ్రూప్-1 భర్తీలకు లైన్ క్లియర్.. సుప్రీం కోర్టు తుది తీర్పు
హైకోర్టు నిర్ణయాన్ని పక్కనబెట్టడానికి తగిన ఆధారాలు పిటిషన్‌లో లేవన్న సుప్రీంకోర్టు.
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీ వివాదానికి శుభం కార్డు పడింది. ఈ పోస్ట్‌ల భర్తీకి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైకోర్టు ఈ విషయంలో తన తుది తీర్పు వెలువరించింది. కాగా ఆ తీర్పును ఛాలెంజ్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1కు చెందిన 563 పోస్ట్‌ల భర్తీని ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పిటిషన్‌లో ఎటువంటి మెరిట్స్ లేవని ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈ విషయంలో హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పింది.
గ్రూప్-1 భర్తీ, భర్తీ ప్రక్రియపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. హైకోర్టు నిర్ణయాన్ని పక్కనబెట్టడానికి తగిన ఆధారాలు పిటిషన్‌లో లేవని పేర్కొంది. హైకోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని పరిశీలించింది, తదుపరి ఆదేశాలను జారీ చేసిందని, అందులో తాము జోక్యం చేసుకోదలుచుకోలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
హైకోర్టు ఆదేశాలేంటంటే
గ్రూప్-1 భర్తీ అంశానికి సంబంధించి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు.. 563 ఖాళీల భర్తీని సమర్థించింది. వెంటనే ఆ భర్తీ ప్రక్రియను చేయాలని కూడా టీజీపీఎస్‌సీకి ఆదేశాలు జారీ చేసింది. అదే ఆదేశాలను సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చింది. గ్రూప్-1 పోస్ట్‌ల భర్తీకి సంబంధించి పిటిషన్ కొట్టివేత.. ఈ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.

