సీఈసీపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు
x

సీఈసీపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు

ఫామ్-6 పై కీలక ప్రశ్నలు సంధించిన న్యాయస్థానం


Click the Play button to hear this message in audio format

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చిన ఏకపక్ష నిర్ణయాల ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. అయితే, ఆయనను తక్షణం సస్పెండ్ చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను మాత్రం కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో, ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన అసలు రికార్డులను సమర్పించాలని ఆదేశించింది.

ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. అంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉపయోగిస్తున్న ఫామ్-6లో చేసిన మార్పులపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ మార్పులను ఎవరు అనుమతించారో రికార్డుల ద్వారా తెలుసుకోవాలని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఫామ్-6లోని డిక్లరేషన్ విభాగంలో చేసిన మార్పులపై వివాదం మొదలైంది. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వ్యక్తులు, గతంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో తాము లేదా తమ తల్లిదండ్రులు మ్యాప్ అయ్యారా అనే వివరాలను వెల్లడించేలా కొత్త డిక్లరేషన్‌ను చేర్చారు.

ఈ మార్పులపై ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పిటిషన్లలో పేర్కొన్నారు. ఇలాంటి మార్పులు చేయాలంటే 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్‌కు కేంద్రం ద్వారా సవరణలు అవసరమని వారు అభిప్రాయపడినట్లు ఆరోపణలు వచ్చాయి.

అయితే, సెప్టెంబర్ 26న ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో.. బీహార్ ఎస్ఐఆర్‌పై మే 2026లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ సవరించిన డిక్లరేషన్‌ను కోర్టు ఆమోదించిందని పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. బీహార్ ఎస్ఐఆర్ విచారణ సమయంలో ఈ మార్పులను తాము పరిశీలించలేదని, ఎందుకంటే తీర్పు వెలువడిన తర్వాతే ఈ మార్పులు తీసుకువచ్చారని కోర్టు తెలిపింది.

దీంతో సవరించిన ఫామ్-6ను తాము ఆమోదించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసలు ఈ మార్పులను ఎవరు చేశారో, ఎవరి అనుమతితో చేశారో తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం రికార్డులను పరిశీలించనున్నట్లు తెలిపింది.

ఇక జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపైనా కోర్టు దృష్టి పెట్టింది. సంబంధిత నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ స్వతంత్రంగా తీసుకున్నారా, లేక పూర్తి ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో ఆమోదించిందా అనే విషయాన్ని రికార్డుల ఆధారంగా పరిశీలించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

అయితే, విచారణ పూర్తయ్యే వరకు జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న మధ్యంతర అభ్యర్థనకు మాత్రం కోర్టు అంగీకరించలేదు. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం నుంచి సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది.

చట్టంలో నిర్దేశించిన ప్రక్రియను పాటించకుండా ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లు తేలితే, ఆ నిర్ణయాలను తిరిగి పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అవసరమైతే చట్టానికి విరుద్ధంగా ఉన్న నిర్ణయాల అమలును నిలిపివేయడంతో పాటు వాటిని రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని పేర్కొంది.

ఈ కేసులో ఒక పిటిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను కేసు తుది పరిష్కారం అయ్యే వరకు సస్పెండ్ చేయాలని కోరగా, మరో పిటిషన్‌లో ఆయనతో పాటు ఇతర అధికారులపై విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం నుంచి రికార్డులు, సమాధానాలను కోరింది. ఆ వివరాల ఆధారంగా నిర్ణయాలు చట్టబద్ధమైన ప్రక్రియ ప్రకారమే తీసుకున్నారా లేదా అన్నది తదుపరి దశలో పరిశీలించనుంది.

Read More
Next Story