‘పతంజలి’ ప్రకటనలపై సుప్రీం ఎందుకు సీరియస్ అయ్యింది?
అత్యున్నత న్యాయస్థానం కేంద్రంపై సీరియస్ అయ్యింది. తప్పుడు ప్రకటనలతో జనాన్ని తప్పుదోవ పట్టించే పతంజలి ఆయుర్వేద ఉత్పత్తి దారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
అత్యున్నత న్యాయస్థానం కేంద్రంపై సీరియస్ అయ్యింది. తప్పుడు ప్రకటనలతో జనాన్ని తప్పుదోవ పట్టించే పతంజలి ఆయుర్వేద ఉత్పత్తి దారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. పతంజలి విషయంలో "ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుంటోంది" అని వ్యాఖ్యానించింది.
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తిదారులు తప్పుడు ప్రకటనల ద్వారా దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. "ఇది చాలా దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుంది" అని బెంచ్ పేర్కొంది.
తప్పుదారి పట్టించే ప్రకటనలు..
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను యోగా గురువు రామ్‌దేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ తయారుచేస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో చూపిన కొన్ని ప్రకటనలను బెంచ్ తప్పుబట్టింది.
IMA ఫిర్యాదు
సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయుర్వేద ఔషధాలను ఉత్పత్తి చేసే సంస్థలు వైద్యుల పట్ల అవమానకర ప్రకటనలు చేశాయని IMA తెలిపింది. ఆధునిక మందులు వాడుతున్నా.. వైద్యులే చనిపోతున్నారని ఇచ్చిన ప్రకటనను ఐఎంఏ తరపు న్యాయవాది కోర్టు దష్టికి తీసుకెళ్లారు. అల్లోపతిని తక్కువ చేసి చూయించే కొన్ని ప్రకటనలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రస్తావించింది.
అప్పట్లో జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం..
‘‘రామ్‌దేవ్ బాబాకు ఏమైంది? యోగాను ప్రాచుర్యంలోకి తెచ్చినందున ఆయనను గౌరవిస్తాం. కాని ఇలా డాక్టర్‌లందరినీ దూషించే తరహాలో ప్రకటనలు ఇస్తున్నారు. డాక్టర్లంతా హంతకులు అన్నట్లుగా భారీ ప్రకటనలు ఇస్తున్నారు’’ అని పదవీ విరమణ చేసిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలని కేంద్రం తరఫు న్యాయవాదిని అత్యున్నత న్యాయస్థానం కోరింది.