IAMC భూవివాదం.. హైకోర్టు తీర్పులో జోక్యం కుదరదన్న సుప్రీంకోర్టు
x

IAMC భూవివాదం.. హైకోర్టు తీర్పులో జోక్యం కుదరదన్న సుప్రీంకోర్టు

IAMCకు భూమి, ఆర్థిక సహాయం కేటాయింపును రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.


హైదరాబాద్‌లోని IAMCకు భూమి కేటాయింపు అంశంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పునే అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. IAMC దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కేసు 2021 డిసెంబర్ 26న జారీ చేసిన జీఓకు సంబంధించినది. అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామంలో 3.70 ఎకరాల భూమిని IAMCకు కేటాయించింది. అదే సమయంలో రూ.3 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా మంజూరు చేసింది.

ఈ కేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు 2025 జూన్‌లో తీర్పు ఇచ్చింది. భూమి మార్కెట్ విలువను అంచనా వేయకుండా కేటాయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేటాయింపు సమయంలో IAMC సంస్థగా నమోదు కాలేదని కూడా పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా నిర్ణయం తీసుకుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్ సంస్థలకు భూమి కేటాయింపులో మార్కెట్ విలువ వసూలు చేయాల్సిన నిబంధనలు ఉల్లంఘించారని స్పష్టం చేసింది.

అయితే సంస్థాగత ఆర్బిట్రేషన్‌ను ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అంగీకరించింది. అదే సమయంలో IAMC పనితీరుపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తీసుకున్న కేసుల్లో గణనీయమైన సంఖ్య ఉచిత సేవలుగా నిర్వహించబడినట్టు గమనించింది.

ప్రైవేట్ ఆర్బిట్రేషన్ సంస్థకు ఆర్థిక సహాయం శాశ్వతంగా ఉండకూడదని హైకోర్టు అభిప్రాయపడింది. తక్కువ కేసుల భారం సంస్థ భవిష్యత్ స్వయం సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఈ అంశంలో న్యాయ ప్రక్రియ ముగిసినట్లైంది. తదుపరి చర్యలు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కొనసాగనున్నాయి.

Read More
Next Story