చనిపోయాడన్నారు, పంచనామా చేశారు, చివరికి శ్మశానంలో శ్వాస తీసుకున్నాడు
x

చనిపోయాడన్నారు, పంచనామా చేశారు, చివరికి శ్మశానంలో శ్వాస తీసుకున్నాడు

రాజస్తాన్ లోని జుంజు జిల్లా, తమిళనాడులోని తిరుచ్చిలో ఇద్దరు మృత్యుంజయులు


అతనో అనాథ, చెవిటి, మూగ కూడా. ఓ షెల్టర్ హోమ్ లో ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. అయితే చికిత్సకు అతని శరీరం స్పందించకపోవడంతో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

అంత్యక్రియలు ఏర్పాటు చేసి శ్మశాన వాటికకు తరలించగా శ్వాస తీసుకుంటున్నట్లు గమనించిన అక్కడి వ్యక్తులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని జుంజు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడు 25 ఏళ్ల రోహితాష్ కుమార్ కు గుర్తించారు. అతను ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వం ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేసింది.

రోహితాష్ కుమార్ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తరువాత అతని శరీరాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పంచనామా సైతం నిర్వహించారు. అయితే, మృతదేహాన్ని చితిపై పెట్టి నిప్పు పెట్టే సమయంలో శ్వాస తీసుకుంటున్నాడని అక్కడి వ్యక్తులు గమనించారు. తరువాత వారు పోలీసులకు, తరువాత అంబులెన్స్ కు కాల్ చేసి విషయం చెప్పారని స్థానిక పోలీసులు వెల్లడించారు.
రోహితాష్ కుమార్ ను తిరిగి జిల్లా ఆసుపత్రికి తరలించారు, అతను ఇంకా బతికే ఉన్నాడని అక్కడి వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం రోహితాష్ కుమార్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
ముగ్గురు వైద్యుల సస్పెండ్..
జుంజును జిల్లా కలెక్టర్ రమావతార్ మీనా, వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, PMO డాక్టర్ సందీప్ పచార్‌లను సస్పెండ్ చేశారు. దీనిపై విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేశామని, వైద్య శాఖ కార్యదర్శికి సమాచారం అందించామని మీనా తెలిపారు.
తమిళనాడు కేసు
మరుంగాపురి సమీపంలోని సురక్కాయిపట్టికి చెందిన పి చిన్నమ్మాళ్ నవంబర్ 16వ తేదీన పురుగుమందు తాగి మణప్పారైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, కుటుంబ సభ్యులు ఆమెను త్వరగా ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఆమె చనిపోయిందని భావించిన బంధువులు ఆమె అంత్యక్రియలకు సిద్ధం చేసి శ్మశాన వాటికకు తీసుకొచ్చారు.
అంత్యక్రియలు ప్రారంభం కానున్న సమయంలో చిన్నమ్మాళ్ ఒక్కసారిగా కళ్లు తెరిచింది. వెంటనే, షాక్‌కు గురైన ఆమె బంధువులు ప్రైవేట్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి, ఆమెను తిరుచ్చిలోని MGMGH కి తరలించారు, అక్కడ ఆమె ఇప్పుడు చికిత్స పొందుతోంది.
Read More
Next Story