హైదరాబాద్ లో  ‘స్విస్ మాల్’  ఏర్పాటు పై చర్చ
x

హైదరాబాద్ లో ‘స్విస్ మాల్’ ఏర్పాటు పై చర్చ

త్వరలో హైదరాబాద్ సందర్శించే అవకాశం


హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు ఆదేశానికి చెందిన బృందం తొందరలో తెలంగాణ పర్యటనకు రానుంది.

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సందర్భంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని వాడ్ (Vaud) రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌ గారితో సమావేశమయ్యార. భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈసందర్బంగా హైదరాబాద్ లో పర్యటించాలనుకుంటున్నట్లు లూసియర్ బ్రోడార్‌ వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో మొట్టమొదటి స్విస్ మాల్ ఏర్పాటు చేసే విషయం ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది.

సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్–2047 విజన్‌ను స్విస్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, స్విస్ బృందం సానుకూలంగా స్పందించింది.

సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, క్రీడల విభాగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు. రిటైల్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అవకాశాలపై చర్చించారు. మహిళా సాధికారతకు సంబంధించి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందం ఆసక్తి కనబరిచింది

ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుట్‌బాల్ క్రీడాకారులే కావడంతో, క్రీడల రంగంలో భాగస్వామ్యంపై కూడా విస్తృతంగా చర్చించారు. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిలో కలిసి పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు.
పరస్పర సహకార అంశాలు పరిశీలించేందుకు త్వరలోనే స్విట్జర్లాండ్ బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తుందని వాడ్ రాష్ట్ర పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రి ఇసబెల్ మోరెట్ గారు తెలిపారు


Read More
Next Story