ప్రతిపాదనల దశలోనే తెలంగాణ విమానాశ్రయాలు: కేంద్రం క్లియరెన్స్ ఎప్పుడు?
x
వరంగల్ మామునూరు విమానాశ్రయం : నిర్మాణ పనులు ప్రారంభం ఎప్పుడు?

ప్రతిపాదనల దశలోనే తెలంగాణ విమానాశ్రయాలు: కేంద్రం క్లియరెన్స్ ఎప్పుడు?

వరంగల్ నుంచి ఆదిలాబాద్ వరకు విమానాశ్రయాల కల… కేంద్రం క్లియరెన్స్ కోసం ఎదురుచూపులు


తెలంగాణలో విమానయాన కనెక్టివిటీ విస్తరణపై ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కొత్త విమానాశ్రయాల నిర్మాణం మాత్రం ప్రతిపాదనల దశను దాటడం లేదు. రాష్ట్రంలో 33 జిల్లాలున్నప్పటికీ శంషాబాద్‌లోని ఒకే ఒక్క విమానాశ్రయమే ప్రధాన కేంద్రంగా ఉంది. వరంగల్ మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూములు సేకరించి కేంద్రానికి అప్పగించినప్పటికీ ప్రాజెక్టు ఇప్పటికీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద పెండింగులోనే ఉంది. దీంతో తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి ఎప్పుడు ప్రారంభమవుతుందన్న ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తెలంగాణలో 33 జిల్లాలుంటే కేవలం శంషాబాద్ లో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.కొత్తగా వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించినా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద పెండింగులో ఉన్నాయి. అత్యంత పురాతన మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి భూ సేకరణ చేసి కేంద్రానికి అప్పగించినా నిర్మాణ పనులు ప్రారంభించలేదు.
తెలంగాణ విమానాశ్రయాల నిర్మాణంపై ఇటీవల సీఎం కేంద్రమంత్రులను కలిసి విన్నవించినా కదలిక లేదు. తాజాగా రెండు రోజుల క్రితం తెలంగాణ విమానాశ్రయాల నిర్మాణ జాప్యంపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ప్రశ్నించారు. విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి సైట్ క్లియరెన్స్ రాలేదు. మన రాష్ట్ర పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 8 విమానాశ్రయాలుండగా, కొత్తగా మరో నాలుగు విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించారు.విమానాశ్రయాల నిర్మాణంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుంది.

సీఎం ఎన్ని లేఖలు రాసినా ప్రతిపాదనల్లోనే...

తెలంగాణలోని వరంగల్ నగరం పరిధిలోని మామునూరులో కొత్త విమానాశ్రయం నిర్మించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి 2024వ సంవత్సరం నవంబరు 5వతేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడుకు లేఖ నంబరు 1090 పేరిట రాశారు.ఉడాన్ పథకం కింద వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. విమానాశ్రయం రన్ వే నిర్మాణానికి వీలుగా అదనంగా 250 ఎకరాల భూమిని సేకరించి రాష్ట్ర ప్రభుత్వం పౌరవిమానయాన శాఖకు అప్పగించింది. అయినా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఈ విమానాశ్రయం ప్రతిపాదన పెండింగులోనే ఉంది.
వరంగల్ మామునూరుతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లిలోని అంతర్ గాం, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేంద్ర మంత్రికి లేఖ రాసినా ఈ ప్రతిపాదనలు కేంద్ర పౌర విమానయాన శాఖ వద్ద పెండింగులోనే ఉన్నాయి.
దేశంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఒక మినీరత్న సంస్థగా ప్రతి సంవత్సరం రూ.5500 కోట్లకు పైగా మూలధన వ్యయంతో దేశవ్యాప్తంగా పలు కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తున్నా, తెలంగాణలో మాత్రం విమానాశ్రయాల నిర్మాణానికి మోక్షం కల్పించడం లేదు.

రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో తెలంగాణ విమానాశ్రయాల అంశం

రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణలో విమానయాన కనెక్టివిటీ విస్తరణపై ఖమ్మం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు.‘‘కొత్తగూడెం విమానాశ్రయం అవసరం ఉంది, మామునూరు 3.5 కిలోమీటర్ల దూరం రన్ వే నిర్మాణానికి స్థలం ఉంది’’ అని ఎంపీ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. దీంతో వరంగల్ విమానాశ్రయం అభివృద్ధి అంశంపై చర్చ జరిగింది.
తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ, విమానయాన మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

రెండేళ్లలోగా పనులు పూర్తి చేస్తాం

తెలంగాణలో శంషాబాద్ అంతర్జాతీయ ఫంక్షనల్ ఎయిర్ పోర్టు ఒక్కటే ఉన్నదని అక్కడే మేజర్ ఆపరేషన్స్ సాగుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ‘‘మామునూరు విమానాశ్రయం చాలా పురాత విమానాశ్రయం అని, ఇక్కడ 1983 వ సంవత్సరం వరకు వాయుదూత్ సర్వీసులు నడిపారు.ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 700 ఎకరాలు ఉందని,రన్ వే 1800 మీటర్ల దూరం విస్తరించేందుకు యుద్ధప్రాతిపదికన 250 ఎకరాలను రాష్ట్రప్రభుత్వం అప్పగించింది.మామునూరు విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన చేస్తాం. ప్లానింగ్ స్టేజీలో ఉంది. రెండేళ్లలోగా పూర్తి చేస్తాం’’అని మంత్రి సమాధానం ఇచ్చారు.

ఇతర విమానాశ్రయాలు...

కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణం కోసం ఒక స్థలం గుర్తించామని, అది రెండు కొండల మధ్య ఉందని, దీనివల్ల ప్రత్యామ్నాయ స్థలం కోసం అన్వేషిస్తున్నామని, దీంతోపాటు వెదర్ డేటా కోసం ఫిజిబులిటీ చూసి సైట్ క్లియరెన్స్ రాగానే దాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. ఆదిలాబాద్ డిఫెన్స్ ఫీల్డు సివిల్ ఏవియేషన్ ఆపరేషన్స్ విమానాశ్రయం స్థలం ఉందని, దీనికి అదనంగా స్థలం కావాలని కోరామని కేంద్రమంత్రి చెప్పారు. పెద్దపల్లి విమానాశ్రయం కూడా పరిశీలనలో ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీ లాంటి కొత్త పరిశ్రమలు ఉన్నందున విమానాశ్రయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

సమీక్షలతో సరి..విమానాశ్రయాల నిర్మాణపనులు ప్రారంభం ఎప్పుడు?

తెలంగాణలో పెండింగులో ఉన్న కొత్త విమానాశ్రయాల నిర్మాణం గురించి కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఢిల్లీలో తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కలిసి మాట్లాడారు. ఇద్దరు కేంద్రమంత్రుల సమావేశంలో వరంగల్,కొత్తగూడెం, ఆదిలాబాద్, పెద్దపల్లితో సహా తెలంగాణలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టులపై సమగ్రంగా సమీక్షించారు. విమానాశ్రయాల నిర్మాణ పురోగతిని నిశితంగా పర్యవేక్షించడానికి, నిర్మాణ పనులు సకాలంలోచేపట్టడానికి, పనులు వేగవంతం చేయడానికి క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఇద్దరు మంత్రులు నిర్ణయించారు. ఇద్దరు కేంద్రమంత్రులు సమీక్షలు తప్పితే విమానాశ్రయాల నిర్మాణ పనుల్లో మాత్రం కదలిక లేదు.
ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతి గురించి సంబంధిత అధికారులతో కలిసి లోతుగా సమీక్షించి, పనులను వేగవంతం చేయాలని అవసరమైన ఆదేశాలు జారీ చేశామని తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు.

తెలంగాణలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలని సీఎం వినతి

ఈ ఏడాది పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిశారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, పెద్దపల్లి విమానాశ్రయాల అభివృద్ధి సహా రాబోయే ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టులపై చర్చించారు. దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు తెలంగాణ నుంచి పెరుగుతున్న కనెక్టివిటీ అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు.
కేంద్రం సమీక్షలు, హామీలు కొనసాగుతున్నా విమానాశ్రయాల నిర్మాణ ప్రాజెక్టులు మాత్రం ఇంకా ప్రణాళికల దశలోనే ఉండటం రాష్ట్రంలో విమానయాన అభివృద్ధిపై సందేహాలు పెంచుతోంది. వరంగల్ మామునూరు సహా ఇతర ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం వేగవంతమైతే ఉత్తర తెలంగాణలో పరిశ్రమలు, పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని ఏవియేషన్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన హామీలు అమలై నిజంగా పనులు ప్రారంభమవుతాయా, లేక మరోసారి ప్రతిపాదనలకే పరిమితమవుతాయా అన్నది చూడాల్సి ఉంది.
Read More
Next Story