
తెలంగాణ బడ్జెట్‌కు ముహూర్తం ఫిక్స్.. 26 నుంచి సమావేశాలు
గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న సభలో 28న 2026-27 బడ్జెట్ ప్రవేశం. సంక్షేమం, అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం.
తెలంగాణ బడ్జెట్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 26 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28న అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తదుపరి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.
ఫిబ్రవరి 28న 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి సభను 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు షురూ చేసింది. నిపుణులతో కలిసి అన్ని రంగాలను పరిశీలిస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయ్యాయి. అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు.
ఈసారి బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి వంటి ఆరు గ్యారంటీల అమలుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశముందని సమాచారం. కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి రంగాలపైనా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
పెన్షన్ల అంశంపై కూడా ఈ సమావేశాల్లో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అందరి దృష్టి నిలిచింది.

