తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రేపు శ్రీకారం
x
తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రేపు శ్రీకారం

రూ.3.2 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అంచనా,అభివృద్ధి–సంక్షేమానికి పెద్ద పీట


తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టంగా భావిస్తున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 16వతేదీ (రేపటి) నుంచి ప్రారంభం కానున్నాయి.రాష్ట్ర కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో సోమవారం ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమై సభ అజెండా, సమావేశాల వ్యవధిని ఖరారు చేయనుంది.తెలంగాణలో ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20వతేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల విస్తరణపై ఈసారి బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట

మార్చి 2026లో జరగనున్న తెలంగాణ బడ్జెట్ 2026-27 సెషన్ మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి,సంక్షేమంపై దృష్టి పెట్టనున్నారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.3.15 లక్షల కోట్ల నుంచి రూ. 3.22 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. మూసీ నదీతీర ప్రాజెక్టు, భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నారు.శాసనసభలో ఆర్డినెన్స్‌ల స్థానంలో కొత్త చట్టాలు ఈ సభలో ఆమోదం పొందే అవకాశం ఉంది. వీటిలో 'గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్'ను మూడు ప్రత్యేక సంస్థలుగా విభజించే ప్రతిపాదన కూడా ఒకటి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను (GHMC) మూడు ప్రత్యేక సంస్థలుగా విభజించే చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రధానంగా సంక్షేమం,అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం ఉంది. నీటిపారుదల, పంచాయతీ రాజ్, మున్సిపల్ పరిపాలన, వ్యవసాయ రంగాలకు అత్యధిక నిధులను కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన నిధుల కేటాయింపులపై ప్రభుత్వం గతంలో అసంతృప్తి వ్యక్తం చేసింది.

కీలక ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు

2026-27 తెలంగాణ బడ్జెట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు సంబంధించిన భారీ కేటాయింపులు చేయనుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను నీటిపారుదల, రవాణా, పట్టణాభివృద్ధి, ఇంధనం, పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. వీటిలో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి.కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయం కోసం రూ. 12.2 లక్షల కోట్లు,రాష్ట్రాలకు వడ్డీ లేని 50 సంవత్సరాల రుణాల్లో రూ. 1.5 లక్షల కోట్లు కేటాయించింది. ఈ రుణ విండో నుంచి తెలంగాణ దాదాపు రూ. 15,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రాయోజిత పట్టణ మిషన్లు, హైవే సంబంధిత కార్యక్రమాల ద్వారా రూ. 5,000 కోట్లు పొందాలని రాష్ట్రం చూస్తోంది.ఈ బడ్జెట్ లో చేయూత పెన్షన్ పథకం కింద ప్రతిపాదిత పెంపుతో సహా, నెలకు రూ.4,000 వరకు దశలవారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సమాయత్తం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ గళాన్ని వినిపించడానికి సమాయత్తం అవుతున్నారు. గవర్నర్ ప్రసంగం కోసం శాసనసభ ,శాసన మండలి రెండూ మొదటిసారి ఒకే భవనం నుంచి పనిచేస్తాయి. ప్రభుత్వం అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాలని నిర్ణయించింది. 2026-27 రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 20న సమర్పించనున్నారు. బడ్జెట్‌తో పాటు గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతపై చట్టం, వృద్ధ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలమైన ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి 10-15 శాతం తగ్గించే బిల్లుతో సహా కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భద్రతపై సమీక్ష

రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎనిమిదో సమావేశాలు, తెలంగాణ శాసనమండలి 26 వ సమావేశాల నేపథ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్ , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , మరియు శాసనమండలి కార్యదర్శి వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి పాల్గొన్నారు.

బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతమైనవని,సభ లోపల, బయట కూడా ప్రశాంత వాతావరణం ఉంటేనే సమావేశాలు మంచిగా జరుగుతాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. అనుకోని సంఘటనలు, అవాంచనీయ పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈసారి నుంచి కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు ఒకే ప్రదేశంలో జరుగుతున్నాయి, కాబట్టి అదనపు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. అవసరమైన నోడల్ అధికారులను , లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలి.సభలు సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహాయ, సహకారాన్ని అందిస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కోఆర్డినేషన్ కోసం ప్రతి శాఖ నుంచి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మొత్తంగా ఈసారి జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు, సంక్షేమ పథకాల విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టగా, కేంద్ర నిధుల కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో వచ్చే రోజుల్లో అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి గట్టి ఎదురుదాడి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.


Read More
Next Story