తెలంగాణ బడ్జెట్ 2026-27: 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం!
x

తెలంగాణ బడ్జెట్ 2026-27: 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం!

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమం, మహిళా శక్తి, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట.


తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026 మార్చి 20న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ కాదని, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దృఢ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ జాతీయ సగటు కంటే వేగంగా దూసుకుపోతోంది. 2025-26లో రాష్ట్ర జీఎస్‌డీపీ (GSDP) 10.7 శాతం వృద్ధి నమోదు చేసింది.

ఇది దేశ సగటు కంటే 2.7 శాతం అధికం. రాష్ట్ర తలసరి ఆదాయం ₹4,18,931కి చేరుకుంది. ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే 1.9 రెట్లు ఎక్కువ. గత ప్రభుత్వ హయాంలోని ₹27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చడం ద్వారా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ కాపాడింది.

కీలక సంక్షేమ పథకాలు

  • ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్: 2026 జూన్ 2 నుండి రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నారు.
  • మహిళా శక్తి: ఐకేపీ (IKP) గ్రూపుల్లోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. ఇందుకోసం ఐదేళ్లలో రూ. 1 లక్ష కోట్ల బ్యాంకు రుణాలు అందించాలని నిర్ణయించారు.
  • మహాలక్ష్మి - గృహజ్యోతి: ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఇప్పటివరకు ₹9,222 కోట్లు ఆదా అయ్యాయి. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది.

వ్యవసాయం - గ్రామీణాభివృద్ధి

  • రైతు సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో ₹23,179 కోట్లు కేటాయించారు.
  • రైతు భరోసా: ఏడాదికి ఎకరాకు ₹12,000 పెట్టుబడి సాయం అందుతుంది.
  • సన్న బియ్యం బోనస్: క్వింటాల్‌కు ₹500 ప్రోత్సాహకం ఇస్తున్నారు. దీనివల్ల రైతులకు ఎకరాకు అదనంగా ₹25,000 ఆదాయం లభిస్తోంది.
  • ఇందిర సౌర గిరి జల వికాసం: ₹12,600 కోట్లతో గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు పంపిణీ చేయనున్నారు.

అభివృద్ధి నమూనా - CURE, PURE, RARE

రాష్ట్రాన్ని మూడు ఆర్థిక మండలాలుగా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. క్యూర్.. హైదరాబాద్ ORR లోపల టెక్నాలజీ, AI, సేవా రంగాల అభివృద్ధి. ప్యూర్.. ORR - RRR మధ్య ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడం. రేర్(RARE) RRR అవతల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఎకో-టూరిజం అభివృద్ధి.

భారత్ ఫ్యూచర్ సిటీ - పాలనా సంస్కరణలు

హైదరాబాద్ అభివృద్ధి కోసం 30 వేల ఎకరాల్లో "భారత్ ఫ్యూచర్ సిటీ" నిర్మిస్తున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి అనే మూడు కార్పొరేషన్లుగా విభజించారు. ధరణి సమస్యల పరిష్కారానికి తెలంగాణ భూ భారతి చట్టం, 2025 అమలు చేస్తూ, 'భూ మిత్ర' చాట్‌బాట్‌ అందుబాటులోకి తెచ్చారు.

తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి గౌరవిస్తూ 'జయ జయహే తెలంగాణ' గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. నిరుద్యోగుల కోసం ఇప్పటికే 67,763 ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది.

Read More
Next Story