తెలంగాణ బడ్జెట్ రూ.3.24 లక్షల కోట్లు..
x

తెలంగాణ బడ్జెట్ రూ.3.24 లక్షల కోట్లు..

విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యంతో బడ్జెట్ రూపకల్పన. కీలక ప్రాజెక్టులకు భారీ కేటాయింపులపై దృష్టి.


తెలంగాణలో కీలక ఆర్థిక నిర్ణయాల దిశగా మరో అడుగు పడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. బడ్జెట్‌కు ముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది.

గత ఏడాది రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి దాదాపు 8 నుంచి 10 శాతం పెంపుతో రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్ల వరకు పెరగనున్నట్లు అంచనా. కొన్ని వర్గాల ప్రకారం మొత్తం అంచనా రూ.3.36 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సంక్షేమ రంగానికి రూ.1 లక్ష కోట్లకు పైగా కేటాయింపులు చేసే అవకాశం ఉంది.

గతంలో రూ.72,396 కోట్లు కేటాయించగా, ఈసారి దాదాపు రూ.77 వేల కోట్ల వరకు పెంపు ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టులకు సుమారు రూ.26 వేల కోట్ల కేటాయింపులు ఉండొచ్చని అంచనా. మూలధన వ్యయాన్ని కూడా గణనీయంగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో రూ.36,504 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని రూ.45 వేల కోట్ల వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీ నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో సుమారు రూ.17 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని అంచనా. యంగ్ ఇండియా స్కూల్స్, సాగునీటి ప్రాజెక్టులు కూడా బడ్జెట్‌లో కీలక స్థానంలో ఉండనున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, తమ్ముడిహట్టి బ్యారేజ్, మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్ర ఆదాయం పెరుగుదలతో బడ్జెట్ పరిమాణం విస్తరించిందని తెలుస్తోంది. జీఎస్టీ మార్పులు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆదాయంపై పెద్దగా ప్రభావం లేకపోయినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల మధ్య ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడుతున్న నేపథ్యంలో ఐదు నుంచి ఆరు కొత్త పథకాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. మొత్తంగా, తెలంగాణ ఆర్థిక దిశను నిర్దేశించే ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సమతుల్యత కల్పించేలా ఉండనుందని భావిస్తున్నారు.

Live Updates

  • 20 March 2026 12:16 PM IST

    వ్యవసాయానికి రూ. 23,179కోట్లు

    రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234 కోట్లు

    మూలధన వ్యవయం రూ.47,267 కోట్లు

    విద్యుత్ శాఖ రూ.21,285 కోట్లు

    రెవెన్యూ వ్యవయం రూ.23,4406 కోట్లు

    జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం

  • 20 March 2026 10:59 AM IST

    తెలంగాణ బడ్జెట్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


  • 20 March 2026 10:50 AM IST

    మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సుమారు రూ.3.30 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశముందని అంచనా.

Read More
Next Story