విద్యా కమీషన్ సిఫారసులను పెడచెవిన పెట్టిన రాష్ట్ర బడ్జెట్
x

విద్యా కమీషన్ సిఫారసులను పెడచెవిన పెట్టిన రాష్ట్ర బడ్జెట్

విద్యా కమీషన్ చెప్పినట్టు బడ్జెట్ లో 18 శాతం కాకపోయినా మనిఫెస్టో లో చెప్పిన 15 శాతం కూడా కేటాయించకపోవటాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పు పట్టాయి


కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మనిఫెస్టోలో చేసిన వాగ్దానానికి అనుగుణంగా విద్యకు 15 శాతం నిధులు మూడవ బడ్జెట్ లో అయినా కేటాయిస్తారని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడవ బడ్జెట్ లో 8.22 శాతం మాత్రమే విద్యకు కేటాయించింది.

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ లో 7.31 శాతం కేటాయించగా, రెండవ బడ్జెట్ లో 7.57 శాతం కేటాయించారు. 2025-26 కు గాను దేశం వివిధ రాష్ట్రాలు కేటాయించిన మొత్తం సరాసరి 15 శాతం కాగా, తెలంగాణ ఈ సారి కూడా అందులో సగమే కేటాయించింది.

“ఈ లెక్కన ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ 15 శాతం బడ్జెట్ చేరుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలో? ఈ అరకొర నిధుల ద్వారా ‘‘రైసింగ్ తెలంగాణ‘‘ పేరుతో విద్యకు ప్రాధాన్యత ఇస్తానంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి! మొత్తం విద్యార్థుల్లో 35 శాతం మాత్రమే నమోదవుతున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సాధ్యం కాదు. అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేస్తానంటూ బడ్జెట్లో భీకర ఉపన్యాసం ఇచ్చిన ప్రభుత్వం, ఉన్నత విద్యకు రు. 5,443 కోట్ల కేటాయింపుతో సాధ్యం కాదని,” ఉమ్మడి రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు కె. వేణుగోపాల్ చెప్పారు.

కాగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలకు రు. 5,000 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు రు. 500 కోట్ల కేటాయింపులు ప్రభుత్వ పథకాల్లో ఉన్నప్పటికీ రు. 20,000 కోట్ల అంచనాతో కేవలం 25 శాతం నిధులతో పూర్తి స్థాయిలో యంగ్ ఇండియా పాఠశాలలు ఉపయోగంలోకి వచ్చేవరకు ఎన్నేళ్లు వేచి చూడాలో? అలాగే విద్యా కమిషన్ ప్రతిపాదిత తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రు. 500 కోట్ల కేటాయింపుతో 2000 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉనికిలోనికి రావడానికి ఎంత కాలం పడుతుందో? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఉదయం అల్పాహారం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు రు. 720 కోట్లు కేటాయింపు ఆహ్వానించిదగిందే అని టిఎస్ యుటిఎఫ్ తో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానించాయి.

రాబోయే విద్యా సంవత్సరంలో ఇప్పటికే ప్రారంభమైన 1,323 పూర్వ ప్రాథమిక పాఠశాలలకు తోడు మరో రెండు వేల నుండి 2,500 పాఠశాలలను ప్రారంభించనున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించడం ఆహ్వానించదగిందని వేణుగోపాల్ చెప్పారు. అయినా పూర్వ ప్రాథమిక విద్యా బోధనకు శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు లేకుండా పూర్వ ప్రాథమిక విద్యా తరగతులు విజయవంతం కాలేవని గుర్తు చేశారు. జిల్లా విద్యాశిక్షణ సంస్థల్లో శిక్షణ వెంటనే ప్రారంభించి, ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తే తప్ప నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య సాధ్యం కాదని గుర్తు చేశారు.

పైపై మెరుగులతో కేటాయింపులు ఉన్నప్పటికీ మౌలికంగా 26,000 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, 664 గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణం, విశ్వవిద్యాలయాలకు మౌలిక వసతులు కల్పించడాన్ని పట్టించుకోకుండా మొత్తం విద్యా వ్యవస్థను బాగు చేయలేం. అందుకు కనీసం పార్టీ వాగ్దానం చేసిన 15 శాతం నిధులను కేటాయించాల్సింది అని అన్నారు. విద్యా కమీషన్ 18 శాతం నిధులను కేటాయించాలనే సూచనను కనీసం పట్టించుకోలేదు.

ఈ విషయం పై విద్యా కమీషన్ ఛైర్మన్ ఆకునూరు మురళి స్పందన కోరగా తను బడ్జెట్ ప్రతిపాదనలు పరిశీలించలేదని స్పందించటానికి నిరాకరించారు.

“విద్యా కమిషన్ సిఫార్సుల ప్రకారం సుమారు రూ. 58,362 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ. 26,674 కోట్లు మాత్రమే కేటాయించడం ప్రభుత్వ పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. అరకొర నిధులతో మౌలిక వసతుల కల్పన, కొత్త ఉపాధ్యాయ నియామకాలు ఏ విధంగా సాధ్యమవుతాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని,” తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, సహధ్యక్షులు, వై. అశోక్ కుమార్ ప్రశ్నించారు.

గత సంవత్సరం కంటే రూ 3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కోసమే సరిపోవచ్చు అని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షుడు చావా రవి అభిప్రాయపడ్డారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల గురించి, మధ్యాహ్నభోజనం నాణ్యత పెంపు గురించి అదనపు నిధుల కేటాయింపు ప్రస్తావన లేదు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను సమీక్షించి కనీసం 15 శాతం కేటాయించాలని టిఎస్ యుటిఎఫ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.

ఉద్యోగులకు ఆరోగ్య భీమా:

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రూ 1056 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్ హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని టిఎస్ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎ వెంకట్ స్వాగతించారు.

అయితే తెలంగాణ రెండో పీఆర్సీ అమలు గురించి గానీ, అదనపు నిధుల కేటాయింపు గురించి గానీ బడ్జెట్ లో మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశకు గురిచేసిందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మంచి పిఆర్సీ అమలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 27 నెలలు గడుస్తున్నా నిలబెట్టుకోకపోవడం విచారకరమన్నారు.

పెండింగ్ డిఎలు, పెండింగ్ బిల్లులు, 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు గురించి ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ, పెండింగ్ బిల్లులు, బకాయిల గురించి కూడా స్పష్టత ఇవ్వాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది.

పథకాన్ని ప్రవేశపెట్టడం ఆహ్వానించదగినదే అయినా 5 లక్షలు పైగా ఉన్న కాంట్రాక్టు/ అవుట్ సోర్సింగ్ సిబ్బంది గురించి ప్రస్తావన లేకపోవడం, సిపిఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత కాంట్రిబ్యూషన్ చెల్లింపు విషయంలో స్పష్టతనీయకపోవడం లోపమని వేణుగోపాల్ చెప్పారు. “ఉద్యోగులు, పెన్షనర్లకు బాకీ పడ్డ 5 డిఎల ప్రస్తావన లేదు. అంతేకాదు గత మార్చి 2024 నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రయోజనాల చెల్లింపు విషయంలో కూడా ఆర్థిక మంత్రి మాటమాత్రమైన ప్రస్తావన చేయలేదు. వారు ప్రతినెల 1500 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతున్నప్పటికీ ఆర్థిక మంత్రి వారి డిమాండ్ ను పట్టించుకోలేదు. ఇక 2023 జూలై నుండి రావలసిన వేతన సవరణకు సంబంధించి పిఆర్సి రిపోర్టును కూడా ఆర్థిక మంత్రి వదిలేశారు,” అని అన్నారు.

ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Read More
Next Story