తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం
x

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం

సభ ప్రారంభానికి ముందు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. అభివృద్ధి ప్రణాళికలను గవర్నర్ వివరించగా, అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు.


తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11.45 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగింది.

సమావేశాలకు ముందు అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, స్పీకర్, మండలి ఛైర్మన్ మరియు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ నేతలు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ ప్రసంగంలో అభివృద్ధి ప్రణాళికలు

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టారు. శ్రమించే తత్వం గల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం 2047 నాటికి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. గత ఏడాది కాలంలో అనేక సంస్కరణలు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి పౌరుడిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలా బడ్జెట్ రూపొందిస్తున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్టు గవర్నర్ వెల్లడించారు.

రోడ్లు, ఎక్స్‌ప్రెస్ వేలు, ఎయిర్‌పోర్టుల ప్రణాళిక

రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా గవర్నర్ వివరాలు తెలిపారు. ఓఆర్ఆర్ మాదిరిగా రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతున్నట్టు చెప్పారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ఆర్‌లకు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. శంషాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

మూసీ పునరుజ్జీవన ప్రణాళిక

మూసీ నది అభివృద్ధిపై కూడా గవర్నర్ ప్రస్తావించారు. మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీని పునరుజ్జీవం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మూసీలోకి మురికి నీరు చేరకుండా 39 ఎస్టీపీల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వివరించారు.

పెట్టుబడులపై వివాదం.. సభలో నిరసనలు

గ్లోబల్ సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు వచ్చినట్టు గవర్నర్ వెల్లడించారు. అయితే ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పెట్టుబడులపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నట్టు నినాదాలు చేశారు. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిలబడి నిరసన తెలిపారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని వారు ఆరోపించారు.

సమావేశాలపై ప్రభుత్వ వ్యూహం

ఈ సమావేశాల్లో ఆరు గ్యారంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు వంటి అంశాలపై చర్చ కోరేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు ఈ నెల 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టి, నెలాఖరులో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి సమావేశాలను ముగించాలని అధికార పక్షం వ్యూహరచన చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాబోయే రోజుల్లో చర్చలు, వాదోపవాదాలతో కొనసాగనున్నాయి.

Read More
Next Story