
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. హైదరాబాద్ మెట్రో స్వాధీనం, ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.2 కోట్ల ప్రమాద బీమా, నగదు రహిత వైద్యం మరియు 2027 జనగణనపై ముందడుగు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల కల్పనలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల కోసం దేశంలోనే ఆదర్శవంతమైన బీమా పథకాలపై చర్చించారు. దాంతో పాటుగా జనగణన, నగదు రహిత వైద్య సదుపాయంతో పాటు హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
క్యాబినెట్ నిర్ణయాలు ఇవే..
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రత కోసం రెండు కొత్త పథకాలను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగులకు పూర్తి భరోసా కల్పించేలా ఈ పథకాలు రూపొందించామని ప్రభుత్వం తెలిపింది.
ప్రమాద బీమా పథకం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండా ఈ పథకం అమలు అవుతుంది. గతంలో సింగరేణి, ట్రాన్స్‌కో ఉద్యోగులకు అమలు చేసిన ఈ పథకాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు.
ఈ పథకం ప్రకారం ప్రమాదంలో మరణిస్తే రూ.1.2 కోట్ల బీమా పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రాష్ట్రంలో 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2.38 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 7.57 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగులు, ప్రభుత్వంపై భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా బీమా అమలు చేయాలని నిర్ణయించారు.
క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 3.56 లక్షల ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17.07 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకం ద్వారా ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించకుండా చికిత్స పొందగలుగుతారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1998 రకాల చికిత్సలు అందిస్తారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వైద్యం అందిస్తారు.
ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం చెల్లిస్తారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. ఉద్యోగులు సంవత్సరానికి రూ.528 కోట్లు చెల్లిస్తే ప్రభుత్వం కూడా రూ.528 కోట్లు చెల్లిస్తుంది. మొత్తం రూ.1056 కోట్లతో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలిపారు.
వైద్య రంగంలో సంస్కరణలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవల కోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీవీవీపీకి పూర్తిస్థాయి ప్రభుత్వ విభాగ హోదా లభిస్తుంది. నిధుల కేటాయింపు పెరుగుతుంది. మందులు, సర్జికల్స్ కొనుగోలు వేగవంతం అవుతుంది. సిబ్బందికి సకాలంలో వేతనాలు అందుతాయి.
వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం మంత్రి దామోదర రాజనర్సింహా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని కమిటీలో నియమించారు. ఆసుపత్రుల్లో మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ సేవలను వేరు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
హెచ్ఎండిఎ విస్తరణ
హెచ్ఎండిఎ పరిధిలోకి నాలుగు గ్రామాలను చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్‌పేట్ మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను చేర్చారు.
రోడ్ల అభివృద్ధి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమగ్ర రోడ్డు నిర్వహణ కార్యక్రమం ఫేజ్-2 చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. ఫేజ్-1లో ఉన్న 744 కిలోమీటర్లకు అదనంగా 300 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తారు. రూ.3145 కోట్లతో ఈ పనులు చేపడతారు.
నీటి సరఫరా ప్రాజెక్టులు
మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-1, ఫేజ్-2 ఆధునీకరణకు రూ.722 కోట్లు కేటాయించారు. ఉస్మాన్ సాగర్ పైప్‌లైన్ ఆధునీకరణకు రూ.282 కోట్లు ఆమోదించారు. పాత పైపులు, పంప్ హౌస్‌ల వల్ల 30 శాతం నీటి నష్టం జరుగుతుందని గుర్తించారు. ఆధునీకరణతో నీటి సరఫరా మెరుగుపడుతుంది.
లాజిస్టిక్స్, విద్యా ప్రాజెక్టులు
రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 223.09 ఎకరాల భూమిని కేటాయించారు. టీజీ హౌసింగ్ బోర్డు భూముల్లో 239 ఎకరాలను పండ్ల మార్కెట్ కోసం కేటాయించారు. గుమ్మడూరులో ఇంజినీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, ఉమ్మాపూర్‌లో ఇంజినీరింగ్ కాలేజీకి 36 ఎకరాలు కేటాయించారు. 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి వివిధ జిల్లాల్లో భూములు కేటాయించారు.
ఇతర భూకేటాయింపులు
ఎలివేటెడ్ కారిడార్ కోసం రక్షణ శాఖ నుంచి తీసుకున్న భూములకు బదులుగా కాప్రా మండలంలో 153 ఎకరాలు కేటాయించారు. భద్రాచలంలో మినీ స్టేడియంకు 5 ఎకరాలు ఇచ్చారు. ధంసలాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి 20 ఎకరాలు కేటాయించారు. చిగురుమామిడి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి 3 ఎకరాలు 12 గుంటలు ఇచ్చారు. కోకాపేటలో నీటి సరఫరా పనుల కోసం భూమి కేటాయించి, శారద పీఠానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని నిర్ణయించారు.
గృహ నిర్మాణం
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద నిర్మించిన షాపులను వేలం వేయాలని నిర్ణయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని నిర్ణయించారు. 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు.

