ముగిసిన పోలింగ్.. పురపోరు ఫలితం అప్పుడే..
x

ముగిసిన పోలింగ్.. పురపోరు ఫలితం అప్పుడే..

ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఓటింగ్ పూర్తి. 13న లెక్కింపు. 16న మేయర్, ఛైర్మన్ ఎన్నికలు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా గడిచింది. సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఓటింగ్ నిలిచింది. అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింది. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. చెదురుమదురు ఘటనలు తప్పితే మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 65శాతం ఓట్లు నమోదయినట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో శాతం కార్పొరేషన్ల కంటే మెరుగ్గా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు.

ఈ నెల 13న ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై నిలిచింది.

జగ్గారెడ్డి హడావుడీ

సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రావడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ను ఆపేస్తానంటూ ఆయన పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్దికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్బంగానే సీఐని సస్పెండ్ చేయాలని, లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు.

Read More
Next Story