‘నీటి వివాదంలో నాదెప్పుడూ ఒకే సమాధానం’
x

‘నీటి వివాదంలో నాదెప్పుడూ ఒకే సమాధానం’

పంచాయితీ కావాలా.. నీళ్లు కావాలా అంటే తన ఓటు నీళ్లకేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


తెలంగాణకు నీళ్లు తీసుకురావడమే తనకు ఎప్పటికీ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర నీటి వివాదాల విషయంలో రాజకీయ ప్రయోజనాలను తానెప్పుడూ చూడలేదని, తాను ఎప్పటికీ చూడనని అన్నారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తెలంగాణ జల వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నీటి సమస్యలను కోర్టుల్లో కాకుండా మనమే పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకూదన్న ఉద్దేశంతోనే 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలంగాణను ఇచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా నీటి సమస్యలకు పరిష్కరించుకోవాలని అన్నారు. ‘‘కోర్టుల్లో కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. జల వివాదంలో రాజకీయ ప్రయోజనం పొందాలని మా ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ఆ ఆలోచన మా ప్రభుత్వానికి కలలో కూడా రాదు’’ అని అన్నారు.

‘‘పంచాయితీ కావాలా.. నీళ్లు కావాలా అని అడిగితే నేనెప్పుడూ తెలంగాణకు నీళ్లు కావాలనే బదులిస్తా. వివాదాలు కావాలా.. పరిష్కారాలా అంటే పరిష్కారాలవైపే నిలబడతా. మన సమస్యలను మనమే సామరస్యంగా పరిష్కరించుకుందాం’’ అని అన్నారు. ఈ సందర్భంగానే ఏసీ సీఎం చంద్రబాబుకు కూడా రేవంత్ రెడ్డ కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్‌ల అనుమతులకు అడ్డంకులు పెట్టకండి’’ అని రేవంత్ కోరారు.

‘‘ఈ అడ్డంకుల వల్లే నిధులు రావడం లేదు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. మేము వివాదాలు కోరుకోవట్లేదు. పరిష్కారాలను కోరుకుంటున్నాం. రాజకీయ ప్రయోజనాలు కాదు.. ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం. తెలంగాణకు పోర్ట్‌ కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు.. రాష్ట్రం ఏదైనా మాకు వివాదాలు అక్కర్లేదు. ఈ విషయంలో ఏపీ ఒక్క అడుగు ముందుకు వేస్తే తెలంగాణ 10 అడుగులు ముందకేస్తుంది’’ అని స్పష్టం చేశారు.

Read More
Next Story