
‘క్రైమ్ తగ్గింది.. నమ్మక ద్రోహం పెరిగింది’
తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్‌పై డీజీపీ కీలక వ్యాఖ్యలు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం క్రైమ్ రేటు 2.33 శాతం తగ్గిందని, అయితే నమ్మకద్రోహం (చీటింగ్) కేసులు మాత్రం 23 శాతం పెరిగాయని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఏడాది పాలన పూర్తవడంతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పోలీస్ శాఖ పనితీరు, నేర గణాంకాలు, కీలక విజయాలను వివరించారు.
వరకట్నం కోసం మహిళల హత్యలు గణనీయంగా తగ్గాయని డీజీపీ స్పష్టం చేశారు. వరకట్న వేధింపుల కేసులు 2 శాతం తగ్గాయని, మహిళల భద్రతకు షీ టీమ్స్ అత్యంత చురుకుగా పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.53 శాతం తగ్గాయని పేర్కొన్నారు.
సైబర్ క్రైమ్‌పై గట్టి చర్యలు
సైబర్ క్రైమ్ కేసుల్లో ఈ ఏడాది రికవరీ 23 శాతం పెరిగిందని డీజీపీ తెలిపారు. మొత్తం రూ.246 కోట్లను రికవరీ చేయగా, 25,500 మందికి రూ.150 కోట్లను రిఫండ్ చేసినట్లు వెల్లడించారు. 371 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని చెప్పారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 3 శాతం తగ్గగా, దేశవ్యాప్తంగా మాత్రం 41 శాతం పెరిగిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసులు, హత్యలు, అత్యాచారాలు తగ్గాయి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 9.5 శాతం తగ్గాయని, హత్య కేసులు 8.76 శాతం తగ్గాయని, అత్యాచార కేసులు 13.45 శాతం తగ్గాయని డీజీపీ వివరించారు. ఈ ఏడాది మొత్తం 2,28,695 కేసులు నమోదయ్యాయని, శిక్షల రేటు 38.27 శాతానికి పెరిగిందని తెలిపారు. గత ఏడాది ఇది 35.63 శాతంగా ఉందన్నారు. 216 కేసుల్లో 320 మందికి జీవిత ఖైదు పడగా, మూడు పాక్సో కేసుల్లో ఉరిశిక్ష పడిందని చెప్పారు.
చైల్డ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు
ఈ ఏడాది చైల్డ్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన 481 కేసులు నమోదు కాగా, 959 మంది పిల్లలను రక్షించామని, 1,277 మంది నిందితులను అరెస్ట్ చేశామని డీజీపీ వెల్లడించారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మొత్తం 12,396 మంది చిన్నారులను రెస్క్యూ చేశామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ కేసులు
రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినా, ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య తగ్గిందని డీజీపీ చెప్పారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల కారణంగా 6,499 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద 2,542 కేసులు నమోదయ్యాయని, ఇది గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిందన్నారు.
కొత్త పోలీస్ స్టేషన్లు, అవార్డులు
ఈ ఏడాది హైడ్రా పోలీస్ స్టేషన్‌ను కొత్తగా ఏర్పాటు చేసినట్లు, సీసీఎస్ రాజేంద్రనగర్, సీసీఎస్ మేడ్చల్ జోన్లను పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్లుగా ప్రకటించినట్లు డీజీపీ తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో రెండు, కల్వకుర్తిలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. నవంబర్‌లో రాయపూర్‌లో జరిగిన డీజీ & ఐజీ సదస్సులో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఏడవ స్థానంలో నిలిచిందని, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో సిబ్బందికి అవార్డులు లభించాయని తెలిపారు.
శాంతియుతంగా ఎన్నికలు, అంతర్జాతీయ ఈవెంట్లు
గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా ప్రశాంతంగా నిర్వహించామని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయని డీజీపీ స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన అంతర్జాతీయ సమ్మిట్, ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సి పాల్గొన్న కార్యక్రమం కూడా విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. “రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం,” అని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.

