
తెలంగాణ డీజీపీ పదవికి న్యాయపరీక్ష
డీజీపీగా నియమితులయ్యే అధికారికి కనీసం 2 ఏళ్ళు సర్వీసు ఉండాలని అన్నీ రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది
డీజీపీ నియామక ప్రక్రియను నెలరోజుల్లో తేల్చాలని గురువారం సుప్రింకోర్టు యూపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రింకోర్టు తాజా ఆదేశాల నేపధ్యం తెలుసుకోవాలంటే కాస్త వెనక్కు ప్రయాణంచేయాలి. శివధర్ రెడ్డి 2025, సెప్టెంబర్ 26న డీజీపీగా అపాయింట్ అయ్యారు. ఈయన సర్వీసు 2026, ఏప్రిల్ 30వ తేదీన ముగుస్తుంది. 2018, జూలై 3వ తేదీన సుప్రింకోర్టు విచారణ సందర్భంగా డీజీపీగా నియమితులయ్యే అధికారికి కనీసం 2 ఏళ్ళు సర్వీసు ఉండాలని అన్నీ రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే మరో ఆదేశం కూడా ఇచ్చింది. అదేమిటంటే కొత్త డీజీపీ నియామక ప్రక్రియ కనీసం మూడునెలల ముందే మొదలుపెట్టాలని. సుప్రింకోర్టు ఇంతస్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా చాలా రాష్ట్రాలు పాటించటంలేదన్న ఆరోపణలున్నాయి.
ఈ నేపధ్యంలోనే డీజీపీ నియామకాన్ని ప్రభుత్వాలు తమిష్టప్రకారమే చేసుకుంటున్నాయి. 2025లో డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం కూడా అలా జరిగిందే. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం కనీస సర్వీసు రెండేళ్ళు ఉన్నవాళ్ళనే డీజీపీగా నియమించాలి. అయితే శివధర్ రెడ్డికి సర్వీసు ఎనిమిది మాసాలు మాత్రమే ఉన్నది. అయినా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా నియమించిందంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ముఖ్యమంత్రి అనుకున్నారు నియామకం జరిగిపోయింది అంతే.
శివధర్ రెడ్డి నియామకం సమయంలో రాష్ట్రప్రభుత్వం యూపీఎస్సీకి డీజీ కేడర్లో ఉన్న వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి, అభిలాష బిస్త్, శిఖాగోయెల్, సౌమ్యామిశ్రా పేర్లను పంపింది. సుప్రింకోర్టు మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వాలు అనుసరించటంలేదని సామాజిక కార్యకర్త మదన్ గోపాల్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే రాష్ట్రప్రభుత్వం శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించేసింది.
అంటే సుప్రింకోర్టు మార్గదర్శకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అర్ధమైపోతోంది. ఇపుడీ విషయం ఎందుకు మళ్ళీ చర్చకు వచ్చిందంటే సామాజిక కార్యకర్త మదన్ గోపాల్ అప్పుడు వేసిన కేసు ఇపుడు సుప్రింకోర్టు విచారణకు వచ్చింది. కేసు విచారణలో సుప్రింకోర్టు ఈరోజు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. డీజీపీ సర్వీసు వివాదాన్ని నెలరోజురల్లో తేల్చాల్సిందే అని సుప్రింకోర్టు యూపీఎస్సీ, రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.
ఎందుకంటే శివధరరెడ్డికి సర్వీసు ఉన్నది ఇక మూడునెలలు మాత్రమే. విచారణ గడువు నెలరోజులు ఇచ్చింది. సుప్రింకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నియామకం జరిగిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. శివధర్ రెడ్డి నియామకానికి యూపీఎస్సీ ఎలాగ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నది ఇక్కడ ప్రశ్నార్ధకం. యూపీఎస్సీనే సుప్రింకోర్టు మార్గదర్శకాలను, ఆదేశాలను పట్టించుకోకపోతే రాష్ట్రప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటాయి ? నాలుగు వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తిచేయాలని సుప్రింకోర్టు ఆదేశించటం ఆశ్చర్యంగా ఉంది. సుప్రింకోర్టు తాజా ఆదేశాల ప్రకారం తెలంగాణకు కొత్త డీజీపీగా ఎవరు నియమితులు అవుతారో చూడాలి.

