రాష్ట్రంలో డాక్టర్ల కొరత… మూడు పోస్టుల్లో ఒకటి ఖాళీ
x

రాష్ట్రంలో డాక్టర్ల కొరత… మూడు పోస్టుల్లో ఒకటి ఖాళీ

రాష్ట్ర ప్రభుత్వ వైద్య వ్యవస్థలో డాక్టర్ పోస్టుల ఖాళీలు, నియామక స్థితి, వివిధ విభాగాల్లో పని పరిస్థితులపై కౌన్సిల్‌లో వెల్లడైన వివరాలు.


తెలంగాణలో భారీగా వైద్యుల కొరత ఉంది. ప్రతి మూడు ప్రభుత్వ వైద్యుల పోస్ట్‌లలో ఒకటి ఖాళీగా ఉందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీని కారణంగా ప్రతి వైద్యుడిపై 1.6 పోస్ట్‌ల ఒత్తిడి అధికంగా పడుతోందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో మొత్తం 14,633 డాక్టర్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 9,008 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 5,625 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో టేబుల్ చేసిన అధికారిక డేటా వెల్లడిస్తోంది. దీని ప్రకారం రాష్ట్రంలో మంజూరైన ప్రతి మూడు డాక్టర్ పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉంది. ఈ గణాంకాలు వైద్య సేవలపై ఉన్న ఒత్తిడిని సూచిస్తున్నాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న నియామకాలు 2,410 పోస్టులను కవర్ చేస్తున్నాయి. అయినప్పటికీ, మరో 3,215 పోస్టులకు ఎలాంటి నియామక ప్రక్రియ లేకపోవడం గమనార్హం. ఇవి మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 22 శాతం వరకు ఉన్నాయి. ఇదే విషయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా.. శాసనమండలిలో మాట్లాడారు. వైద్యుల కొరతపై తమ ప్రభుత్వం పనిచేస్తోందని, అవసరమైన అన్ని పోస్టులను భర్తీ చేస్తోందని తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్పటి నుంచి ఇప్పటి వరకు 10వేల పోస్ట్‌లను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా 7,000కు పైగా పోస్టుల నియామకాలు తుది దశలో ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ నియామకాలు పూర్తయిన తర్వాత కూడా మొత్తం వ్యవస్థలో ఇంకా 6,759 ఖాళీలు మిగిలే అవకాశం ఉన్నట్లు డేటా సూచిస్తోంది. వైద్య కళాశాలల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆసుపత్రుల్లో 7,745 పోస్ట్‌లు మంజూరు కాగా వాటిలో 4,959 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 2,786 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మొత్తం ఖాళీ 2,786 పోస్ట్‌లు ఉండగా వాటిలో కేవలం 607 పోస్టులకు మాత్రమే నియామకం జరుగుతోంది. మిగిలిన 2,179 పోస్టులకు ఎలాంటి భర్తీ ప్రణాళిక లేదని స్పష్టమవుతోంది. దీనిపై స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ.. ఒకేసారి అధిక సంఖ్యలో వైద్య కళాశాలలు ప్రారంభం కావడమే దీనికి కారణమని చెప్పారు. దాంతో పాటు అర్హత కలిగిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత కూడా ఉందని తెలిపారు.

ఈ లోటును తగ్గించేందుకు ప్రభుత్వం 1,200 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసింది. అదనంగా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్ నాటికి ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. జిల్లా స్థాయి ఆసుపత్రుల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 4,347 మంజూరు పోస్టుల్లో 1,968 డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 2,379 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇందులో 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల నియామకాలు కొనసాగుతున్నట్లు మంత్రి తెలిపారు. కౌన్సిల్ డేటా ప్రకారం 1,658 నియామకాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే ఖాళీలు కొంత తగ్గే అవకాశం ఉంది. ప్రాథమిక ఆరోగ్య సేవల్లో ఒక విభాగం మాత్రం పూర్తిస్థాయి భర్తీ దిశగా ఉంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 145 ఖాళీలకు 145 నియామకాలు కొనసాగుతున్నాయి.

అయితే, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 315 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, అక్కడ ఎలాంటి నియామక ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ అంశంపై మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. మొత్తం వైద్య, నర్సింగ్, పారామెడికల్ రంగాల్లో 13,929 ఖాళీల్లో 7,170 పోస్టులకు మాత్రమే నియామకాలు కొనసాగుతున్నాయి. మిగిలిన 6,759 పోస్టులకు ప్రస్తుతానికి ఎలాంటి భర్తీ ప్రణాళిక లేదు.

కౌన్సిల్‌లో టేబుల్ చేసిన డేటా ప్రకారం, ఒక డాక్టర్‌పై సగటున 1.6 మంజూరు పోస్టుల భారం పడుతోంది. జిల్లా ఆసుపత్రుల్లో ఈ నిష్పత్తి మరింత అధికంగా ఉంది. మొత్తం మీద, కొనసాగుతున్న నియామకాలు కొంత ఉపశమనం ఇవ్వనున్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ఖాళీలు ఇంకా మిగిలే పరిస్థితిని డేటా సూచిస్తోంది.

Read More
Next Story