
తెలంగాణ ఉద్యమ తొలి నవల "విప్లవయోధులు" ఆవిష్కరణ
దీనిని తెలంగాణలో పాఠ్యపుస్తకం చేయాలి: బిఎస్ రాములు
1953లో ఎమ్.ఆర్.నాగం అనే రచయిత రచించిన ‘తెలంగాణ విప్లవ యోధులు’ అనే నవలను తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి శనివారం నాడు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆవిష్కరించారు.
ఇప్పటి వరకు 1955లో వట్టికోట ఆళ్వార్ స్వామి రాసిన నవల ‘ప్రజల మనిషి’ నవలను తెలంగాణ మొదటి నవలగా ప్రచారం లో వున్నది. కానీ 1953 లో ముద్రితమైన ఎమ్.ఆర్. నాగం రాసిన ‘తెలంగాణ విప్లవ యోధులు’ నవల తెలంగాణ సాహిత్య చరిత్రలో మొదటి నవల అవుతుంది సంగిశెట్టి శ్రీనివాస్ ముందుమాటలో రాశారు. ఈ నవలను వారి కుటుంబసభ్యులు పునర్ముద్రించారు. తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించిన అనేక వెలుగు చూడని అంశాలు ఈ నవలలో ఉన్నాయి. రజాకార్ల దురాగతాలు, సామాజిక పరిస్థితులు, సామాన్య జనం ఎదుర్కొన్న కష్టాలు వేదనలు, పార్టీల వైఖరులు, స్పస్టంగా ఈ కథలో ప్రతిఫలిస్తాయి. ఏడు దశాబ్దాలకు పైగా ఎక్కడా లభించని విలువైన రచనను నేటి తరానికి అందించడం, చరిత్రలో కలిసిపోతున్న ఒక చారిత్రక సాక్ష్యాన్ని తిరిగి వెలుగులోకి తేవడం, 90 ఏళ్ళ పైబడి వున్న రచయిత భార్య కి తొలికాపీ అందించాలన్న కోరికతో ఈ పునర్ముద్రణ చేపట్టడం విశేషం. ఈ సభలో రచయిత కుటుంబ సభ్యులందరు, రచయిత సహ ఉద్యోగులు, శిష్యులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ సభా కార్యక్రమం ఒక పండుగలాగా జరిగింది.
ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాహిత్య చరిత్రను పునస్సమీక్ష చేయించాల్సిన అవసరాన్ని "విప్లవ యోధులు " నవల ముందుకు తెచ్చిందని నరసింహారెడ్డి అన్నారు.

