
22A సమస్యలకు చెక్.. హైలెవల్ కమిటీతో శాశ్వత పరిష్కారం
తెలంగాణలో 22A నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. 30 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.
తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని పరిష్కరించడానికి ముగ్గురు సీనియర్ అధికారులతో హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 18, 2026న ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా తీసుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి CCLA కమిషనర్ లోకేశ్ కుమార్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారు.
కమిటీకి ప్రభుత్వం 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ సమయంలో 22A నిషేధిత భూముల జాబితాలో ఉన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించాలి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను కూడా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక, సిఫార్సులు సమర్పించాలి. ముఖ్యంగా భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డులు, న్యాయపరమైన సమస్యలను కమిటీ పరిశీలిస్తుంది. అర్హత ఉన్న ప్రైవేట్ భూములను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో 22A జాబితా నుంచి తొలగించే అంశంపై సిఫార్సులు చేయనుంది. ప్రభుత్వం మొత్తం 12 రకాల భూ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ పరిధిలోని ఆమోదిత లేఅవుట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు కొత్త పాలసీ తీసుకురావడం కూడా కమిటీ పరిశీలించాల్సిన అంశాల్లో ఒకటి. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాల్లోని భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ పట్టా భూములు, నాలా రుసుములకు సంబంధించిన సమస్యలపైనా పరిష్కారం చూపనున్నారు.
నాలా చార్జీలను నేరుగా స్టాంప్ డ్యూటీతో కలిపి రిజిస్ట్రేషన్లకు అనుమతించే అంశాన్ని పరిశీలించనున్నారు. అలాగే సికింద్రాబాద్‌లోని లీజ్‌హోల్డ్ ఆస్తులు, జీవో 59, జీవో 118 కింద ఉన్న భూముల సమస్యలు కూడా కమిటీ పరిధిలోకి వస్తాయి. అదే సమయంలో ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడటం కూడా ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. పొరపాటున 22A జాబితాలో చేరిన నిజమైన ప్రైవేట్ భూముల యజమానులు, రైతులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపడమే కమిటీ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది.

